Site icon vidhaatha

ఏయూవీని పంపిస్తే.. సముద్రగర్భాన విమాన శకలాలు కనిపించాయి

సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఆచూకీ లేకుండా పోయిన ఎఎన్‌-32 (AN -32 )విమానం శ‌క‌లాలు తాజాగా బయ‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో అందులో ప్ర‌యాణించిన 29 మంది సైనికుల కుటుంబాల‌కు కాస్త‌లో కాస్త ఊర‌ట ల‌భించింద‌నే చెప్పాలి. 2016 జులై 22న ఈ ఘ‌ట‌న జ‌ర‌ర‌గా ఆ సంవ‌త్స‌రం మొత్తం స‌ముద్రంలో వివిధ సంస్థ‌లు తీవ్ర‌మైన సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించాయి. అయినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో రెస్క్యూ ఆప‌రేష‌న్‌ను ముగిస్తున్నామ‌ని అదే సంవ‌త్స‌రం సైన్యం ప్ర‌క‌టించింది. అందులో ఉన్న‌వారంతా మ‌ర‌ణించార‌ని భావించ‌డం మిన‌హా చేయ‌గ‌లిగింది ఏమీ లేద‌ని విచారం వ్య‌క్తం చేస్తూ వారి వారి కుటుంబ స‌భ్యుల‌కు లేఖ‌లు రాసింది.


అయితే తాజాగా ఏ విధమైన ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ చేప‌ట్ట‌కుండానే ఈ విమాన శ‌క‌లాలు బ‌య‌ట‌ప‌డ‌టం విశేషం. నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓష‌న్ టెక్నాల‌జీ (ఎన్ఐఓటీ)..త‌న అటాన‌మ‌స్ అండ‌ర్‌వాట‌ర్ వెహిక‌ల్ (ఏయూవీ) సామ‌ర్థ్యాన్ని స‌ముద్రంలో ప‌రీక్షిస్తున్న‌పుడు ఈ విమానం గురించి అధికారుల‌కు తెలిసింది. ఈ ఆప‌రేష‌న్ వివ‌రాల‌ను ఎన్ఐఓటీ (NIOT) డైరెక్ట‌ర్ డా.జీఏ రామ‌దాస్ గుర్తుచేసుకున్నారు. ఆయ‌న తెలిపిన ప్ర‌కారం.. సముద్రగ‌ర్భ అన్వేష‌ణ కోసం నార్వేకు చెందిన కోంగ్స్‌బ‌ర్గ్ మారిటైమ్ నుంచి ఎన్ఐఓటీ ఒక అత్యాధునిక‌మైన ఏయూవీని కొనుగోలు చేసింది. ఓష‌న్ మిన‌ర‌ల్ ఎక్స్‌ప్లొరేష‌న్ 6000 అనే పేరున్న ఈ ఏయూవీ.. స‌ముద్రంలో 6000 మీట‌ర్ల లోతు వ‌ర‌కు వెళ్లి ప‌రిశోధ‌న‌లు చేయ‌గ‌ల‌దు. ఒక్క‌సారి దీనిని ప్రోగ్రామ్ చేసేసి నీటిలోకి వ‌దిలిపెడితే.. మ‌ళ్లీ 48 గంట‌ల త‌ర్వాతే ఒడ్డుకు వ‌స్తుంది. అప్ప‌టి వ‌ర‌కు దానిక‌దే నిర్ణ‌యాలు తీసుకుంటూ వివిధ అధ్య‌య‌నాలు చేప‌డుతుంది. అది తీసుకొచ్చిన డేటాను డౌన్‌లోడ్ చేసుకుని శాస్త్రవేత్త‌లు అధ్య‌య‌నం నిర్వ‌హిస్తారు. ఈ క్ర‌మంలో అనుకోకుండానే ఏఎన్‌-32 విమానం ఆచూకీ చివ‌రిసారి ల‌భ్య‌మైంద‌ని భావిస్తున్న ప్రాంతంలో ఈ ఏయూవీని ప‌రిశోధ‌న‌ల‌కు పంపించారు.


ఆ ప్రాంతంలో అది 3500 మీట‌ర్ల లోతుకు వెళ్లి డేటాను సేక‌రించుకు వచ్చింది. ఆ వివ‌రాల‌ను ప‌రిశీలించి చూడ‌గా ఏయూవీ సౌండ్ నేవిగేష‌న్ అండ్ రేంజింగ్ (సోనార్ ) సిగ్న‌ల్స్ చాలా బ‌లంగా ఉన్నట్లు గుర్తించారు. దీనిని బ‌ట్టి ఆ స‌మ‌ద్ర‌గ‌ర్భంలో లోహంతో త‌యారైన ఏదో మాన‌వ నిర్మిత వ‌స్తువు ఉండి ఉంటుందని ప్రాథ‌మిక అవ‌గాహ‌న‌కు వ‌చ్చారు. సముద్రంలో ఉండే స‌హ‌జ‌మైన వ‌స్తువులు చాలా బ‌లహీన‌మైన సోనార్ ప్ర‌తిధ్వ‌నుల‌ను అందిస్తాయి. కొన్ని సార్లు అస‌లే ఉండ‌వు. ధ్వ‌ని మాన‌వ నిర్మిత వ‌స్తువుల‌ను తాకితేనే అత్యంత బ‌ల‌మైన సోనార్ ప్ర‌తిధ్వ‌నులు వ‌స్తాయి. అయితే మాకు ఏఎన్‌-32 విమానం అక్క‌డే చివ‌రి సారి క‌నిపించ‌కుండా పోయింద‌ని అప్పుడు తెలియ‌దు. ఈ సోనార్ నివేదిక‌ల త‌ర్వాత ఆ స‌మాచారాన్ని ఎయిర్‌ఫోర్స్‌కు ఇచ్చిన‌ప్పుడు వారు ఈ విషయాన్ని మాకు చెప్పారు అని రామ‌దాస్ పేర్కొన్నారు.


ప్ర‌స్తుతం విమానం శ‌క‌లాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని చెబుతున్న ప్ర‌దేశంలో మ‌రో విమానం కూలిపోయిన‌ట్లు రికార్డులు లేవు. కాబ‌ట్టి అవి ఏఎన్‌-32 విమానానికి చెందిన‌విగానే భావిస్తున్నామ‌ని ఎయిర్‌ఫోర్స్ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. త‌మ ద‌గ్గ‌ర ఉన్న స‌మాచారాన్ని బ‌ట్టి చూస్తే విమానం ముక్క‌లు ముక్క‌లు అయిపోయి ఉంద‌ని.. రామ‌దాస్ తెలిపారు. ఏయూవీ కేవ‌లం స‌మాచారాన్ని ఇవ్వ‌గ‌ల‌దు త‌ప్ప ఆ శిథిలాల‌ను బ‌య‌ట‌కు తీసుకురాలేద‌ని ఆయ‌న అన్నారు. ‘2016లో కూడా ఎన్ఐఓటీ రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో పాల్గొంది. అప్ప‌టికి మా ద‌గ్గ‌ర ఉన్న అధునాత‌న ప‌రిక‌రాల‌తో ఉన్న నాలుగు నౌక‌ల‌ను పంపాం. అయితే స‌ముద్ర ఉప‌రిత‌లం నుంచి సోనార్ సిగ్న‌ల్స్ పంప‌డం వ‌ల్ల 3000 మీట‌ర్ల దిగువ‌న ఏముందో చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు స‌ముద్ర గ‌ర్భం నుంచి అధ్య‌య‌నం చేయ‌డం క‌లిసొచ్చింది’ అని ఆయ‌న వివ‌రించారు. 2016, జూన్ 22న చెన్నైలోని తాంబ‌రం ఎయిర్‌పోర్ట్ నుంచి 29 మంది సైనికుల‌తో ఉన్న ఏఎన్‌-32 వాయుసేన విమానం గాల్లోకి లేచింది. సాధార‌ణ భ‌ద్ర‌తా ప‌ర్య‌వేక్ష‌ణ‌లో భాగంగా వారు 1300 కి.మీ. ప్ర‌యాణించి అండ‌మాన్‌లోని పోర్ట్ బ్లెయిర్‌కు చేరుకోవాలి. అయితే చెన్నైకి తూర్పుగా 280 కి.మీ. దూరంలో ప్ర‌యాణిస్తూ రాడార్‌లో హ‌ఠాత్తుగా మాయ‌మైపోయింది. ఆ త‌ర్వాత వివిధ సంస్థ‌లు సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించిన‌ప్ప‌టికీ విమానం ఆచూకీ బ‌య‌ట‌ప‌డ‌లేదు.

Exit mobile version