విధాత: అదానీ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన అప్పుల వివరాలను ఇవ్వాలని స్థానిక బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్టింగ్ పరిశోధక సంస్థ హిండెన్ బర్గ్.. అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందంటూ గతవారం ఓ సంచలన నివేదికను బయటపెట్టిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆర్బీఐ తాజా ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇటీవలే ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం అదానీ గ్రూప్ పై ఓ కన్నేసినట్టు ప్రకటించడం గమనార్హం. అదానీ గ్రూప్ లోని 9 సంస్థలకు పీఎన్‌బీ రూ.7,000 కోట్ల రుణాలిచ్చింది.
అదానీ ఎయిర్‌పోర్ట్స్ విభాగానికే ఇందులో పెద్ద ఎత్తున మంజూరు చేసింది. ఇప్పుడు ఆర్బీఐ కూడా అదానీ అప్పుల గురించి ఆరా తీస్తుండటంతో సదరు గ్రూప్ ఆర్థిక సామర్థ్యంపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఆగని అదానీ షేర్ల పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ సంస్థల షేర్ల పతనం కొనసాగుతున్నది. గురువారం కూడా మదుపరులు అమ్మకాలకు దిగుతుండటంతో అన్ని సంస్థలు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ సుమారు రూ.1.72 లక్షల కోట్లు పడిపోయినది తెలిసిందే. గత వారం రోజుల్లో అదానీ గ్రూప్ తమ మార్కెట్ విలువను 100 బిలియన్ డాలర్లకుపైగానే కోల్పోయింది.
స్విస్ బ్రోకరేజీ దిగ్గజం క్రెడిట్ సూసీ.. అదానీ బాండ్లకు విలువే లేదని చెప్పడం ఇందుకు కారణం. ఈ క్రమంలోనే రూ.20,000 కోట్ల ఎఫ్‌పీవోను అదానీ అనూహ్యంగా రద్దు చేయడం కూడా సంచలనంగా మారింది. ఈ ఎఫెక్ట్‌తోనే గురువారం స్టాక్ మార్కెట్లలో అదానీ షేర్లు నేలచూపులు చూస్తున్నాయని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.