Site icon vidhaatha

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ వెంచర్ల‌తో పారాహుషార్‌!

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: 

అనుమతులు లేకపోయినా కొందరు యథేచ్ఛగా అక్రమంగా వెంచర్లను అమ్మేస్తున్నారు. నిజానికి వెంచర్‌ ప్రారంభించే ముందు వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుగా రెవెన్యూ కార్యాలయంలో వ్యవసాయేతర (నాన్ అగ్రికల్చర్) భూమిగా మార్చుకోవాలి. అందులో భాగంగానే నాలా పర్మిషన్ తీసుకోవాలి. దీనికోసం ప్రభుత్వానికి కొంత ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. నాలా పర్మిషన్ తీసుకున్న తర్వాత గ్రామపంచాయతీ నుండి అనుమతి పొందాలంటే లేఅవుట్ చేస్తున్న స్థలంలో 10 శాతం బడికి, గుడికి, పార్కు, ఇతరత్రా అవసరాల కోసం వదిలిపెట్టాలి. ఆ వదిలి పెట్టిన స్థలాన్ని గ్రామపంచాయతీ పేరున మార్ట్ గేజ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. దానితోపాటు వెంచర్ లో ప్రధాన రోడ్డును 40 అడుగులు వేయాలి. వెంచర్ లోని అంతర్గత రోడ్లు 33 అడుగులు తప్పకుండా రోడ్డు తీసి ప్లాటింగ్ చేయాల్సి ఉంటుంది. మురికి కాలువలు తదితర అవసరాల కోసం మరో 15 శాతం కేటాయించాలి. నిబంధన ప్రకారం స్థలం వదిలిపెట్టి గ్రామపంచాయతీ నుండి అనుమతి పొందాలి. ఇలాంటి నిబంధనలకు నీళ్లు వదిలి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమకు నచ్చిన రీతిలో ప్లాటింగ్ చేసి అమాయక ప్రజానీకానికి అంటగట్టి చేతులు దులుపుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విష‌యాలు తెలియ‌క కొనుగోలు చేసేవారు భ‌విష్య‌త్తులో వర్షాకాలంలో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఇంటి నిర్మాణానికి అనుమ‌తుల కోసం కూడా అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొనాల్సి వ‌స్తుంద‌ని కొంద‌రు అధికారులు తెలిపారు. కొనుగోలుదారులు అన్ని అనుమతులు పరిశీలించాకే కొనుగోలు చేయాలని చెపుతున్నారు. అనుమతులు తీసుకోకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ అక్రమ లేఔట్ వ‌ద్ద ఏజెంట్లను నియమించుకొని, కమీషన్ల ప్రాతిపదికన అమ్ముకుంటున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.


మంచిర్యాల జిల్లాలో నిబంధనలకు పాతర

మంచిర్యాల జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతోంది. లేఅవుట్లు లేకుండానే అక్రమంగా వెంచర్లు వెలుస్తున్నాయి. కొందరు ఏ అనుమతులు లేకుండానే ప్లాట్ల అమ్మకాలు కూడా సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవసాయ భూములు కాస్తా ప్లాట్లుగా మారుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు మాత్రం ఈ విషయాన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రియల్టర్లది ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరిగింది అంటే ఏమో అనుకోవచ్చు. కానీ మంచిర్యాల, ల‌క్షెట్టిపేట‌ మీదుగా వెళుతున్న 63వ‌ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకొని ఈ తంతంగం అంతా జరుగుతున్నా ఉన్నతాధికారుల కంట పడకపోవడం విశేష‌మైతే.. క్షేత్రస్థాయిలో పట్టించుకోవాల్సిన పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మరోవిశేష‌మ‌ని స్థానికులు పేర్కొంటున్నారు.



అనుమ‌తులు లేకుండానే గోడ క‌ట్టేశారు!

అసలు విషయానికి వస్తే మంచిర్యాల జిల్లా వేంపల్లి శివారులోని ఆర్టీవో ఆఫీస్ సమీపంలో ఎస్బీఆర్‌ కాలనీ ఎదురుగా మంచిర్యాల, లక్షెట్టిపేట 63వ జాతీయ రహదారి అనుకొని సుమారు 6.5 ఎకరాల వ్యవసాయ ఉన్న‌ది. దీనిని లే అవుట్ లేకుండా వెంచర్ చేసి, 105 ప్లాట్స్ చేసి అమ్ముకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నప్పటికీ గ్రామపంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. హైవే రోడ్డు పక్కనే ఉన్న ఈ వెంచర్‌కు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్లాటింగ్ చేస్తున్నా.. అధికారులు చూసీ చూడనట్లు వ్య‌వ‌హరిస్తున్నార‌ని ప‌లువురు అంటున్నారు. వ్యవసాయ భూమిని నాలా పర్మిషన్ తీసుకోకుండా నాన్ అగ్రికల్చర్ భూమిగా మార్చకుండానే ప్లాట్లుగా మారుస్తున్నప్పటికీ ఏ అధికారి ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు దారితీస్తున్న‌ది. వర్షాకాలంలో గోదావరి నీళ్లు వెంచర్ లోకి రాకుండా ఉండడానికి సిమెంట్ వాల్ (గోడ) నిర్మాణం చేసినప్పటికీ గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్లాటింగ్ పూర్తయి దశలవారీగా రియల్ వ్యాపారులు తామ చేసిన ప్లాటింగ్ అమ్ముకున్న తర్వాత అధికారులు మేలుకొంటారేమో అని స్థానికులు ఆరోపిస్తున్నారు.


అనుమ‌తులు లేవు

సంబంధిత వేంపల్లి పంచాయతీ కార్యదర్శిని వెంచర్ అనుమతులపై వివరణ కోరగా వెంచర్‌కు ఎలాంటి అనుమతులు లేవని నోటీసు జారీ చేశామని తెలిపారు. ప్లాటింగ్ కోసం వెంచర్‌లో హద్దులకు సంబంధించి పోల్స్ వేస్తున్నారని తెలుపగా, ఇంకా వేయలేదని వేసిన తర్వాత పూర్తిగా తొలగిస్తామని పేర్కొనడం గమనార్హం. హాజీపూర్ తాసిల్దార్‌ను నాలా పర్మిషన్‌పై సంప్రదించగా స‌ద‌రు సర్వే నంబర్లలో ఎలాంటి నాలా అనుమతులు పొందలేదని తెలిపారు.

Exit mobile version