Site icon vidhaatha

హరీశ్‌రావుకు అధికారం దక్కాలంటే ఆయన మరో ఔరంగజేబ్ కావాల్సిందే

విధాత, హైదరాబాద్‌ : మాజీ మంత్రి హరీశ్‌రావుకు అధికారం రావాలంటే.. అధికారం కోసం తండ్రిని జైల్లో వేసి, అన్న‌ను చంపిన క‌ర్క‌శ చ‌రిత్ర‌కు మారుపేరైన ఔరంగ‌జేబుగా మారాల్సిందేన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. త‌నను ముఖ్య‌మంత్రిని చేస్తే మేడిగ‌డ్డ‌ను పున‌రుద్ధ‌రించి నీటిని ఎత్తిపోస్తాన‌న్న హ‌రీశ్‌వ్యాఖ్య‌ల‌పై సీఎం ఘాటుగా స్పందించారు. పదేళ్లు మంత్రిగా ఉండి ఏం చేయనోడు ఇప్పుడేదో చేస్తానంటున్నాడని విమర్శించారు. త‌మ‌ ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుంటే మామా అల్లుళ్లు మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారన్నారని, ప్రాజెక్టులపై చర్చ పెట్టి అసెంబ్లీకి రమ్మంటే పారిపోయిండ్రని ఎద్దేవా చేశారు. గురువారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరై నియామక పత్రాల‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గత బీఆరెస్ ప్రభుత్వం 1.81లక్షల కోట్లు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదన్నారు. కాగ్ నివేదిక సభలో పెట్టామని తెలిపారు. మేడిగడ్డ పేక మేడలా కూలిపోయిందని వ్యాఖ్యానించారు. గత బీఆరెస్ ప్రభుత్వం 3,650రోజులు అధికారంలోకి ఉన్న కేసీఆర్‌కు ఉద్యోగ నియామకాలకు సమయం దొరకలేదని, దోచుకున్నదాన్ని దాచుకోవడంపైనే వారు దృష్టి పెట్టారన్నారు. వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. 30లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు చేపడుతున్నామన్నారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీలో నియామకాలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. త్వరలోనే గ్రూప్ 1 పరీక్షను నిర్వహించబోతున్నామని ముఖ్య‌మంత్రి చెప్పారు. దశ బాగుంటే దిశతో పని లేదని, ఇప్పటికైనా ప్రజలకు ఏం ద్రోహం చేశారో కేసీఆర్ తెలుసుకోవాల‌ని సూచించారు. 3,650 రోజులు అధికారంలో ఉండి మీరు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. త‌మ‌ ప్రభుత్వం ఏర్పడిన 70 రోజుల్లో 25వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టామని, ఇది మీ కళ్లకు కనిపించడం లేదా? అన్నారు. మీరు ఉరితాళ్లు కట్టుకుని వేలాడినా ఇంకేం చేసినా.. ప్రజలు మీపై సానుభూతి చూపబోరని స్ప‌ష్టం చేశారు.

ఒక్కొక్కటిగా ఉద్యోగ నియామకాల చిక్కుముడులు విప్పుతున్నామని తెలిపారు. పోలీసు, ఎక్సైజ్‌, ఫైర్ శాఖల్లో 13,444 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని గుర్తుచేశారు. త్వరలోనే గ్రూపు పరీక్షలన్నీ పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. అందరికీ న్యాయం చేస్తూనే.. బీఆరెస్‌ చేసిన అవినీతి బట్టబయలు చేస్తామని అన్నారు.

6450పాఠశాలలు మూసేశారు

గత బీఆరెస్ పాలనలో తండాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న 6,450 సింగిల్ టీచర్ పాఠశాలలు మూసేశారన్నారు. పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతోనే గత ప్రభుత్వం పాఠశాలలు మూసేసిందన్నారు. విద్యపై గత ప్రభుత్వం కేవలం 6శాతం మాత్రమే ఖర్చు చేసిందన్నారు. తమ ప్రభుత్వం ఆ పాఠశాలల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటుందన్నారు. త్వరలో మెగా డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టి పేదలకు విద్య అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. గురుకుల పాఠశాలలన్నీ ఒకే గొడుకు కిందకు తీసుకోస్తామన్నారు. 20ఎకరాల్లో ఒకే క్యాంపస్‌లో అన్ని రకాల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. కొడంగల్ లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామన్నారు. ఈ మోడల్ ను అన్ని నియోజకవర్గాల్లో ఆచరణలోకి తీసుకొస్తామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇందుకు కావాల్సిన స్థలాలను సేకరించాలని అధికారులకు ఆదేశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీఎస్ శాంతికుమారి, సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు.

Exit mobile version