విధాత: మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ శాఖ చేసిన సోదాలు ముగిశాయి. మూడో రోజు ఉదయం మంత్రి మల్లారెడ్డి, బంధువులు, సన్నిహితులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. తనిఖీల అనంతరం సుమారు రూ. 15 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ వర్గాలు వెల్లడించాయి.
మంత్రి వ్యాపార లావాదేవీల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు గుర్తించినట్టు తెలిపాయి. మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, పేజీ సీట్ల విషయంలో విద్యార్థుల నుంచి సుమారు రూ.135 కోట్లు డొనేషన్ల కింద వసూలు చేసినట్లు పేర్కొన్నారు.
అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలు, గుర్తించిన అక్రమాలపై ఈ నెల 28,29 తేదీల్లో విచారణకు హాజరై మంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులు వివరణ ఇవ్వాలని ఐతే శాఖ సమన్లు జారీ చేసింది.
అధికారులు వేధించారు: మర్రి రాజశేఖర్ రెడ్డి
మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఐటీ అధికారుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్యాంకు లాకర్ తెరవడానికి నా కుమార్తెను తీసుకెళ్లారు. మహిళా సిబ్బంది లేకుండా నా కుమార్తెను తీసుకెళ్లడం సరి కాదని అన్నారు.
నా కుటుంబీకులను ఐటీ అధికారులు వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇంట్లో రూ.4 కోట్ల నగదు సీజ్ చేసినట్లు తెలిసింది. గతంలోనూ ఐటీ దాడులు జరిగాయి. ఐటీ, జీఎస్టీ చెల్లింపులకు సంబంధించిన విషయాలన్నీ పారదర్శకంగానే ఉన్నాయి.