Site icon vidhaatha

సీనియర్‌ గాయకుడు పంకజ్‌ ఉధాస్‌ కన్నుమూత

ముంబై: సీనియర్‌ గాయకుడు పంకజ్‌ ఉధాస్‌ (72) దీర్ఘకాలిక అనారోగ్యంతో సోమవారం ఉదయం కన్నుమూశారు. ‘చిట్టీ ఆయీ హై’, ‘జీయేతో జీయే కైసే’, చుప్‌కే చుప్‌కే వంటి అనేక అద్భుతమైన పాటలు పంకజ్‌ ఉధాస్‌ పాడారు. పంకజ్‌ మృతిని ఆయన బృందం ధృవీకరించింది. ‘పంకజ్‌ సర్‌ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగోలేదు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఆయన బ్రీచ్‌ క్యాండీ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు’ అని తెలిపింది. పంకజ్‌ ఉధాస్‌ కుమార్తె నయాబ్‌ ఉధాస్‌ సామాజిక మాధ్యమాల్లో తన తండ్రి మరణవార్తను తెలిపారు. 

‘దీర్ఘకాలిక అనారోగ్యంతో ఫిబ్రవరి 26వ తేదీ, 2024న పద్మశ్రీ అవార్డు గ్రహీత పంకజ్‌ ఉధాస్‌ దివంగతులయ్యారని బరువెక్కిన గుండెలతో తెలియజేస్తున్నాం’ అని ఆమె తన పోస్టులో తెలిపారు. పంకజ్‌ ఉధాస్‌ భౌతికకాయానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ఘజల్ గాయకుడి ఉన్నప్పటికీ.. నామ్‌, సాజన్‌, మొహ్రా వంటి సినిమాలకు ఆయన పాటలు పాడారు.


గాయకుడిగా అనేక అల్బంలను పంకజ్‌ ఉధాస్‌ విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కచేరీలు నిర్వహించారు. తన గాన మాధుర్యంతో, అద్భుతమైన పదబంధాలతో ప్రేక్షకులను కట్టిపడేసేవారు.

సంగీతానికి ఆయన చేసిన సేవకు గుర్తింపుగా పద్మశ్రీ సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. మధుర గాయకుడి మృతికి సింగర్‌ సోను నిగం సంతాపం ప్రకటించారు. పంకజ్‌ ఉధాస్‌ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నా బాల్యంలో ఒక ముఖ్యమైన భాగాన్ని ఈ రోజు కోల్పోయాను. శ్రీ పంకజ్‌ ఉధాస్‌ జీ.. ఐ మిస్‌ యూ. మీరు లేరని తెలిసిన దగ్గర నుంచి నా హృదయం కన్నీరు పెడుతున్నది’ అని రాశారు.

Exit mobile version