New Train | తిరుమల శ్రీవారి భక్తులకు భారతీయ రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ఏపీలోని తిరుపతి, కేరళలోని కొల్లం మధ్య కొత్తగా రైలు పట్టాలెక్కనున్నది. ఈ రైలును మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. తిరుపతి-కొల్లం ఎక్స్‌ప్రెస్ (17421) రైలు నేటి నుంచి అందుబాటులో ఉండనున్నది. ఈ రైలు చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్- తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిశూర్, ఆలువ, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, తిరువల్ల, చెంగన్నూర్, కాయంకుళం, చంగానస్సేరి, మావెళికార, కాయన్‌కులం మీదుగా కొల్లం రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. ఈ రైలు వారంలో రెండు రోజులు మాత్రమే నడుస్తుంది. తిరుపతి నుంచి కొల్లానికి మంగళ, శుక్రవారాల్లో.. కొల్లం నుంచి తిరిగి తిరుపతికి బుధ, శనివారాల్లో పరుగులు తీస్తుంది. ఆయా రోజుల్లో తిరుపతిలో మధ్యాహ్నం 2.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు కొల్లానికి చేరుతుంది.
తిరిగి ఉదయం 10.45 గంటలకు కొల్లం నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 3.20 గంటలకు తిరుపతికి చేరుతుంది. ఈ రైలులో రెండు ఏసీ టూటైర్ కోచ్‌లతో పాటు ఐదు ఏసీ త్రీ టైర్, ఏడు స్లీపర్ క్లాస్, పాంట్రీ కార్, రెండు జనరల్ కోచ్‌లు, సెకండ్ క్లాస్ కోచ్, లగేజ్ కమ్ బ్రేక్ కోచ్ ఉంటాయి. అయితే, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే, శబరిమల అయ్యప్ప దర్శానికి వెళ్లే భక్తులకు సైతం సౌకర్యంగా ఉంటుందని పేర్కొంటున్నారు. తెలంగాణ, ఏపీ నుంచి ఎక్కువ భక్తులు శబరిమలకు వెళ్తుంటారు. శబరిమల దర్శానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో చాలా మంది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వేశాఖ అధికారులు వివరించారు. ప్రయాణికులు ఈ రైలు సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.