- కుమారుడు, కోడలు కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై!
- వారి వెంటే 15 – 20 మంది ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో నేతలు బీజేపీలో చేరే అవకాశాలు
- మధ్యప్రదేశ్‌లో రాజకీయ కలకలం
- రాహుల్ యాత్ర నేపథ్యంలో కీలక పరిణామాలు
- మాజీ సీఎంను బుజ్జగిస్తున్న అధిష్ఠానం
- ఎమ్మెల్యేలతో రాష్ట్ర పార్టీ పెద్దల ఏకాంత చర్చలు
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్‌నాథ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి, బీజేపీలో చేరనున్నారనే వార్తలు దేశ రాజకీయాల్లో సంచలనం రేపాయి. దాదాపు నాలుగేళ్ల క్రితం.. 2020 మార్చిలో జ్యోతిరాదిత్య సింథియా మద్దతుదారులైన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వం 15 నెలకే కుప్పకూలింది. ఇది ఆ పార్టీకి తీవ్ర ఎదురు దెబ్బగా పరిణమించింది. అయితే.. నాలుగేళ్ల తర్వాత మరోసారి కాంగ్రెస్ పార్టీ మరోభారీ ఎదురుదెబ్బను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమల్‌నాథ్, పార్టీ ఎంపీ, ఆయన కుమారుడు నకుల్‌నాథ్ బీజేపీలో చేరబోతున్నారన్న వార్తలతో కలకలం రేగింది. పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, ఆమె కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా పార్టీ అగ్ర నాయకత్వం కమల్‌నాథ్‌ను బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీతో, నెహ్రూ-గాంధీ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. దానికి గౌరవం ఇవ్వాలని కోరినట్టు సమాచారం. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం సైతం నష్టనివారణ పనుల్లో నిమగ్నమైంది.
ఫిబ్రవరి 22న ఎంపీలోకి రాహుల్ యాత్ర
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఫిబ్రవరి 22వ తేదీన మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించనున్నారు. ఆ సమయానికి ఎలాంటి నష్టం లేకుండా లేదా కనీస నష్టంతో సరిపెట్టేలా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలోనే పార్టీకి ఉన్న 66 మంది సిటింగ్ ఎమ్మెల్యేలతో ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడినట్టు సమాచారం. కమల్‌నాథ్ లేదా ఆయన కుమారుడు నకుల్‌నాథ్, కోడలు ప్రియానాథ్ బీజేపీలో చేరినట్టయితే వారితోపాటు కనీసం 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో ఓడిపోయిన 5 నుంచి 8 మంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వదిలి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని కమల్‌నాథ్ శిబిరం వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు మేయర్లు కూడా గుడ్‌బై చెబుతారని అంటున్నారు. అదే జరిగితే కాంగ్రెస్‌కు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బలు ఖాయమని అంచనా వేస్తున్నారు.
కమల్ నాథ్ ను టార్గెట్ చేశారు
ఐదు దశాబ్దాలుగా పార్టీలో ఉంటున్న కమల్‌నాథ్ అనేక అవమానాలు ఎదుర్కొన్నారని, పార్టీ ఆయనను విస్మరించిందని ఆయన సన్నిహితుడిగా పేరున్న ఛింద్వారా ఎమ్మెల్యే దీపక్ సక్సేనా అన్నారు. కమల్‌నాథ్ ‘పెద్ద చర్య’ తీసుకోవడం తథ్యమని ఆయన స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌తోపాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ.. ఒక్క కమల్‌నాథ్‌ను మాత్రమే అధిష్ఠానం తప్పపడుతున్నదని సక్సేనా విమర్శించారు. ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి ఈ అవమానాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఎంపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి కమల్‌నాథ్‌ను తొలగించడం, రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు అవకాశం కల్పించక పోవడాన్ని ఆయన ప్రస్తావించారు. ‘ఆయన ఇందిరాగాంధీ హయాం నుంచి అన్ని వేళలా గాంధీ కుటుంబం పక్షాన నిలిచారు. గతంలో కాంగ్రెస్‌లోని అన్ని కమిటీల్లో కమల్‌నాథ్‌కు స్థానం ఉండేది. కానీ.. ఇప్పుడు లేదు. ఇప్పటి పరిస్థితే చూసుకుంటే.. రేపో మాపో కమల్‌నాథ్, ఆయన కుమారుడు అతి పెద్ద నిర్ణయం తీసుకుంటారు’ అని సక్సేనా ఒక ఆంగ్ల పత్రికకు చెప్పారు.
కాంగ్రెస్ మేకపోతు గంభీరం
ఈ అంశంలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్.. ‘మేమంతా ఆయనను ఇందిరాగాంధీ మూడో కుమారుడిగా భావిస్తాం. ఆయనకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పట్ల అంకిత స్వభావంతో ఉన్నారు. పార్టీ మూల స్తంభాల్లో ఆయన ఒకరు. పార్టీలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇతరులపై ఉన్నట్టే ఆయనపై కూడా ఈడీ, ఆదాయం పన్ను శాఖ, ఇతర దర్యాప్తు సంస్థల ఒత్తిడి ఉన్నది. అయినా.. ఆయన పార్టీని వీడరని నమ్మకంతో ఉన్నాను’ అని చెప్పారు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లతోపాటు.. అనేక అంశాలపై కమల్‌నాథ్‌ను బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందనే విమర్శలు ఉన్నాయి.