నేను ఆరోగ్యంగా ఉన్నా.. అవన్నీ వదంతులే.. : తమిళనాడు సీఎం స్టాలిన్‌

తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, ఉదయనిధి డిప్యూటీ సీఎం అవుతారనే ప్రచారం అవాస్తవమని తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్పష్టం చేశారు.

  • Publish Date - January 13, 2024 / 10:36 AM IST

  • సీఎం స్టాలిన్‌ ఆరోగ్యంపై వదంతులు
  • యువజన సమావేశం నుంచి దృష్టిమళ్లించేదుకే
  • దుష్ర్పచారంపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆగ్రహం

చెన్నై : తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా సీఎం స్టాలిన్‌ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను నియమించబోతున్నారని వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తేల్చి చెప్పారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని తెలిపారు. ఈ వార్తలను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ కూడా ఖండించారు.


‘నేను పూర్తి ఆరోగ్యంతో, ఉల్లాసంతో ఉన్నాను. నేను పని చేస్తున్నాను.. పని చేస్తున్నాను.. పని చేస్తున్నాను..’ అని సీఎం స్టాలిన్‌ చెప్పారు. తన ఆరోగ్యం గురించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయనున్నారన్న వార్తలను సైతం ఆయన కొట్టిపారేశారు. సంచలనం కోసమే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర హక్కుల సాధన కోసం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువజన విభాగం సమావేశం నుంచి కార్యకర్తలు దృష్టి మళ్లించరాదని ఆయన కోరారు. రాష్ట్ర హక్కులు, సమాఖ్యవాదాన్ని కాపాడేందుకు ఈ సమావేశం జరుగుతున్నదని, దీనిని వ్యతిరేకించేవారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.


ఈ నెలలో స్టాలిన్‌ స్పెయిన్‌ వెళ్లనున్నందున ఉదయనిధి ఉపముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని కొన్ని స్థానిక వార్తా చానళ్లలో వార్తలు వచ్చాయి. వాటిని ఉదయనిధి కూడా ఖండించారు. స్టాలిన్‌ తండ్రి కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టాలిన్‌ ఆయనకు డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Latest News