గడ్డకట్టే చలిలో మోదీ సభకు ఉద్యోగుల తరలించారు.. : మెహబూబా ముఫ్తీ ఫైర్‌

శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో నిర్వహించిన ప్రధాని మోదీ సభకు ప్రభుత్వోద్యోగులను బలవంతంగా తరలించారని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ విమర్శించారు.

  • Publish Date - March 7, 2024 / 11:13 AM IST

శ్రీనగర్‌ : శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో నిర్వహించిన ప్రధాని మోదీ సభకు ప్రభుత్వోద్యోగులను బలవంతంగా తరలించారని ఎన్డీయే మాజీ భాగస్వామ్యపక్షం పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ విమర్శించారు. గతంలో ప్రధానులుగా ఉన్న అటల్‌ బిహారి వాజ్‌పేయి, మన్మోహన్‌సింగ్‌ల పర్యటనలకు భిన్నంగా మోదీ పర్యటన ఉన్నదని అన్నారు. వాజ్‌పేయి, మన్మోహన్‌ పర్యటనలకు వచ్చినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా, ఉత్సాహంగా సభలకు తరలి వచ్చేవారని, గుండెల్లో ఒక నమ్మకంతో తిరిగి వెళ్లేవారని పేర్కొన్నారు. కానీ.. మోదీ పర్యటన అందుకు పూర్తి భిన్నంగా సాగిందని విమర్శించారు. సున్నాకంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో తెల్లవారుజామున ఐదు గంటలకే ఉద్యోగులందరినీ వాహనాలు ఎక్కించి, ప్రధాని సభకు తరలించారని ఆరోపించారు. ఒకవైపు ప్రజలు తీవ్ర అవమానాలు ఎదుర్కొంటుంటే.. 2019 తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, పండుగ చేసుకుంటున్నారనే వాతావరణం కల్పించేలా ఉద్యోగులను తరలించడం బాధాకరమని అన్నారు. ఉగ్రవాదం తీవ్రస్థాయిలో ఉన్న సమయాల్లో కూడా వాజ్‌పేయి, మన్మోహన్‌ పర్యటనలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేవారని, కానీ.. ఇప్పుడు 370 ఆర్టికల్‌ రద్దుతో ప్రజలందరూ లబ్ధి పొందుతున్నారని బక్షి స్టేడియంలో చెప్పిన మాటలు వారి గాయాలపై కారం చల్లడమేనని కశ్మీరీలకు అర్థమైందని చెప్పారు.


రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోని ఇతర ప్రాంతాల్లో బీజేపీ ఓటు బ్యాంకును పదిలపర్చుకునేందుకు ప్రధాని కశ్మీర్‌ పర్యటనను ఉన్నదని జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి అయిన మెహబూబా ఆరోపించారు. బుధవారం నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఒమర్‌ అబ్దుల్లా కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. ప్రధాని సభకు హాజరవ్వాలని ఉద్యోగులను బెదిరిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక సుదీర్ఘ పోస్టును ఆయన పెట్టారు. ప్రధాని సభకు హాజరుకాని ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని బెదిరించారని అందులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. బక్షి స్టేడియంలో మాట్లాడిన మోదీ.. తాను కశ్మీరీల హృదయాలను గెలుచుకున్నానని చెప్పుకొన్నారు. 2014 తర్వాత ఇక్కడకు వచ్చిన సందర్భాల్లో కశ్మీరీల హృదయాలు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నానని ప్రతిసారీ చెప్పేవాడినని, ఇప్పుడు వారి హృదయాలు గెలుచుకున్నది చూస్తున్నానని అన్నారు.

Latest News