High Court |
- మధ్యంతర ఉత్తర్వులు జారీ
- జీవోలకు ముందు యథాస్థితినే కొనసాగించాలి
- ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన ఉన్నత ధర్మాసనం
హైదరాబాద్, విధాత : తెలంగాణలోని వీఆర్ఏల సర్దుబాటుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చాలా కాలంగా వీఆర్ఏల పే స్కేల్, అర్హతలు కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్స్ కల్పించాలని, 55 సంవత్సరాలు దాటిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించాలని గత కొన్నేండ్లుగా వారు విధులను బహిష్కరిస్తు పలు రకాల నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో చాలా మంది వీఆర్ఏలు ఆత్మహత్యలు చేసుకున్న విషయం కూడా తెలిసిందే. దీంతో ప్రభుత్వం దిగివచ్చి జీవో నెం. 81, 85లతో పాటు ఈనెల 5న వీఆర్ఏలను జూనియర్ అసిస్టెంట్లుగా నియమించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తు హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి.
ప్రభుత్వం నిర్ణయం సరైంది కాదు
వీఆర్ఏలను జూనియర్ అసిస్టెంట్లుగా ప్రభుత్వం నిర్ణయించడం సరైంది కాదంటూ, వెంటనే జూనియర్ అసిస్టెంట్లుగా వీఆర్‌ఏల నియామకాన్ని ఆపాలని ఆఫీస్ సబార్డినేట్‌లు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.81, 85లతో పాటు ఈనెల 5న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ 30 మంది సబార్డినేట్లు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తమకు పదోన్నతులు కల్పించకుండా కొత్తగా సృష్టించిన పోస్టుల్లో రాష్ట్రంలోని వీఆర్‌ఏలను నియమించడం సరైంది కాదంటూ పిటిషనర్లు తమ పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ పి.మాధవీదేవి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ముందుగా పిటిషనర్ల తరుఫున న్యాయవాది పీవీ క్రిష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. ఆఫీస్ సబార్డినేట్లకు ప్రమోషన్లు కల్పించకుండా, వీఆర్ఏలను జూనియర్ అసిస్టెంట్లుగా నియమించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు. ఇది తెలంగాణ సర్వీసు నిబంధనలకే విరుద్దమన్నారు. వెంటనే వారి నియామకాలను ఆపాలని, ఆఫీస్ సబార్డినేట్లకు న్యాయం చేయాలని ధర్మాసనాన్ని కోరారు.
వీఆర్‌ఏలకు పోస్టులు ఇవ్వడంపై తమకు ఎలాంటి అభ్యంతరంలేదని, కానీ తమకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉన్నదని గుర్తు చేశారు. తమకు కేటాయించాల్సిన వాటిని వీఆర్‌ఏలకు కేటాయిస్తే తమకు ఎలా న్యాయం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం వీఆర్‌ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సస్పెండ్ చేసింది.
వీఆర్‌ఏల సర్దుబాటు ప్రక్రియను నిలిపివేయాలని మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. జీవోలకు ముందు యథాస్థితిని కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో పిటిషనర్లు ప్రతివాదులుగా సీఎస్, ఆర్థికశాఖ, రెవెన్యూ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సీసీఎల్‌ఏలతోపాటు ఎన్నికల సంఘాన్ని చేర్చారు.