- ఎంపీ సీటు ఆశించిన రాజయ్య
- కడియంకు ఇవ్వనుండటంతో కినుక
- పొంగులేటిని కలిసిన మాజీ డిప్యూటీ సీఎం
- 10న కాంగ్రెసులో చేరేందుకు ముహూర్తం?
- కాంగ్రెస్ లోకి వలసలు షురూ!
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి : ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలిచే స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నిర్ణయించుకున్నారు. దాదాపు సంవత్సర కాలంగా ఆ పార్టీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి సీటు కోల్పోయిన రాజయ్య.. ఎట్టకేలకు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు ఆ లేఖను చూపెట్టారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన ఇప్పటికే పూర్వ రంగాన్ని పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 10వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఓ మీడియా చానల్‌తో రాజయ్య మాట్లాడుతూ పార్టీలో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే అన్నారు. నిజానికి రాజయ్యకు టికెట్ నిరాకరించినప్పుడే ఆయన పార్టీ మారుతారని అనుకున్నారు. కానీ పార్టీ మారినా స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ వస్తుందనే విశ్వాసం ఆయనకు లేదు. స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ త్యాగం చేసినందుకు 2023 అక్టోబర్ 5న ఆయన తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి (రైతుబంధు) చైర్మన్‌గా అప్పటి ప్రభుత్వం నియమించింది.
బీఆరెస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి ఉంటే రాజయ్య పదవిలో కొనసాగేవారు. ప్రభుత్వం రాకపోతే తన పదవి పోతుందని తెలుసు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో కొంతమంది సిట్టింగులను మారుస్తారనే టాక్ వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో వరంగల్ సీటును ఆశించారు. కానీ అది కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు ఇస్తారని సమాచారం. అందుకే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని తెలుస్తున్నది.
తెలంగాణ ఉద్యమ సమయంలో రాజయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో 2012లో రాష్ట్ర సాధనలో భాగస్వామి కావడం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. మంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై ఆరోపణలతో కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. 2018లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచారు. మొన్న ఎన్నికల్లో ఆయనపై సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణ కారణంగా టికెట్ దక్కలేదు.
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా తాను ప్రత్యర్థిగా భావించే కడియం శ్రీహరి గెలవడంతో రాజయ్య మరింత ఇబ్బందుల్లో పడ్డారు. తర్వాత కూడా నియోజకవర్గంలో తన అనుచరులను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. శాసనసభ ఎన్నికల్లో జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ అభ్యర్థుల విజయానికి కృషి చేసినట్లు ఆయన చెబుతున్నారు. రాజయ్య తాజాగా వరంగల్ ఎంపీ సీటును ఆశించినట్లు చెబుతున్నారు.
గతంలో ఆయనపై వచ్చిన ఆరోపణలను మరోసారి తెరపైకి తెస్తూ రాజయ్యను కాదని ఇతరుల వైపు ఆ పార్టీ మొగ్గు చూపుతున్నట్లు భావించిన రాజయ్య ఇక గులాబీ పార్టీలో ఉండడం వల్ల తన రాజకీయ భవిష్యత్తుకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని భావించి పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దీనిలో భాగంగానే ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడా ఇప్పటికే మంతనాలు జరిపినట్లు సమాచరాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన పాత పరిచయాలను వినియోగించుకొని తిరిగి ఆ పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లుగా భావిస్తున్నారు.
ప్రభుత్వాన్ని కూలుస్తామనడం దారుణం
ఈ సందర్భంగా రాజయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తాననడం సరైనది కాదని విమర్శించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. తన సహచరులతో సమావేశమై చర్చించిన అనంతరం ఏ పార్టీలో చేరేది నిర్ణయిస్తాన్నారు. గత ఆరునెలల కాలంగా మానసిక వేదనను అనుభవిస్తున్నానని చెప్పారు. అధిష్ఠానం దృష్టి కూడా తన సమస్యను తీసుకుపోయినప్పటికీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికలు జరిగినప్పటి నుంచి బీఆరెస్ అధిష్ఠానంలో ఎలాంటి స్పందన లేదని, పార్టీ విధానాలు మార్చుకోవడం లేదని అన్నారు. బీఆరెస్‌కు క్షేత్రస్థాయిలో ఆదరణ కరువైందని వ్యాఖ్యానించారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. తన రాజీనామా విషయాన్ని కేసీఆర్‌కు తెలియజేస్తానని, ఆ తర్వాతే ఏ పార్టీలో చేరే విషయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. మాదిగల అస్తిత్వం, ఆత్మగౌరవం కాపాడేందుకు కృషి చేస్తానంటూ రాజయ్య చెప్పారు.
రాజయ్య తాజా ప్రకటనతో బీఆర్ఎస్ అధిష్ఠానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. బుజ్జగించేందుకు ఏమైనా ఆ పార్టీ నాయకులు రంగంలోకి దిగుతారా అనే చర్చ సాగుతున్నది. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప రాజయ్య బీఆర్ఎస్ పార్టీని వీడడం ఖాయంగా భావిస్తున్నారు. ఒక విధంగా శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ పార్టీని వీడి చోటామోటా నాయకులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నప్పటికీ ఒక మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమైనట్లుగా భావిస్తున్నారు.