Site icon vidhaatha

TS Weather Report | తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన వాతావరణశాఖ

TS Weather Report | రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. దీంతో ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణకు తీపికబురు చెప్పింది. రాగల నాలుగు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు సైతం జారీ చేసింది. ఎండల నేపథ్యంలో సామాన్య జనానికి ఊరట కలిగించినా.. రైతులకు మాత్రం ఈ వానలు నష్టాన్ని మిగిల్చనున్నాయి. ఇప్పటికే కాత దశకు వచ్చిన మామిడి రైతులకు ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నష్టం కలిగే అవకాశం ఉన్నది.

శనివారం సాయంత్రం నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాతోపాటు పలు ప్రాంతాల్లో భారీగా వడగళ్ల వాన కురిసింది. దీంతో మామిడి, వరిపంటలకు నష్టం కలిగింది. ఇదిలా ఉండగా.. ఆదివారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పలుచోట్ల వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పింది. సోమవారం నుంచి గురువారం వరకు పలుచోట్ల ఉరుములు మెరుపులు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Exit mobile version