- టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం
- ఒకట్రెండు రోజుల్లో కొత్త చైర్మన్, సభ్యులు!
- ప్రభుత్వ పరిశీలనలో పలువురి పేర్లు
- నిరుద్యోగుల హర్షాతిరేకాలు
(విధాత ప్రత్యేకం)
టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి సహా ఐదుగురు సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల రద్దు వంటి అంశాల నేపథ్యంలో చైర్మన్ జనార్దన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అయితే గత ప్రభుత్వం ఆయన రాజీనామా తిరిస్కరించింది. కమిషన్‌లో జరిగిన పొరపాట్లను సరిదిద్ది, సంస్కరణలు చేపట్టి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించింది. అయితే ప్రస్తుత కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టే పరీక్షలు పాదర్శకంగా జరుగుతాయన్న విశ్వాసం తమకు లేదని నిరుద్యోగులు అన్నారు. విపక్ష పార్టీలు కూడా వాళ్లు రాజీనామా చేయాల్సిందేనని పట్టుపట్టాయి. దీనికి నాడు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. నిరుద్యోగుల పక్షాన పోరాడింది. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశంలో చైర్మన్ సహా సభ్యులంతా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారిని తొలగించాలని, బోర్డు ప్రక్షాళన చేయాలని నిరుద్యోగులు పోరాటం చేసినా గత ప్రభుత్వం స్పందించలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీలు ప్రక్షాళన చేస్తామని వాగ్దానం చేశాయి. ప్రభుత్వం మారిన తర్వాత డిసెంబర్‌లో చైర్మన్‌తోపాటు సభ్యులు రాజీనామా చేశారు. ఈ అంశం గవర్నర్ పరిధిలో ఉండటం, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో వీళ్ల రాజీనామాలు ముడిపడి ఉండటం వల్ల దీనిపై నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్ కొంత సమయం తీసుకున్నారు. న్యాయపరమైన సలహాలు తీసుకుని, రాష్ట్రపతి నుంచి కూడా కొన్ని అభ్యంతరాలపై అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే వారి రాజీనామాలపై నిర్ణయం తీసుకున్నారు. దీనిపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ సంగతి గురించి ప్రశ్నించినప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా కొత్త కమిషన్ ఏర్పాటు ద్వారానే కొలువుల భర్తీకి చర్యలు చేపడుతామన్నారు. నిరుద్యోగులకు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ఇటీవలె యూపీఎస్సీ చైర్మన్‌ను కలిసి సర్వీస్ కమిషన్ ప్రక్షాళనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్చించారు. యూపీఎస్సీ తరహా ఇయర్ క్యాలెండర్ ప్రకటన, పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడానికి అనుసరించాల్సి విధానాలను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారిలతో పాటు ఐఏఎస్ అధికారులు వాణిప్రసాద్, అనితా రామచంద్రన్, నదీమ్‌లు యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ భేటీలో కూలంకషంగా చర్చించారు. దానికి అనుగుణంగా ఇప్పుడు అడుగులు పడనున్నాయి.
కొత్త బోర్డు ఏర్పాటు మార్గం సుగమం
సీఎం చెప్పిన విధంగానే త్వరలో కొత్త కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. దీనికోసం ఇప్పటికే పలువురి పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ఒకటి రెండు రోజుల్లోనే చైర్మన్, సభ్యులను నియమించవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి ఛైర్మన్‌తో పాటు 10 మంది సభ్యులను నియమించాలి. పూర్తిస్థాయి కమిషన్ ఏర్పాటు అవుతుందా?లేదా ఛైర్మన్‌తో పాటు ఐదుగురు సభ్యులను నియమిస్తారా? అన్నది చూడాలి. కొత్త కమిషన్ ఏర్పాటయ్యాక బోర్డు సమావేశం అవుతుంది. వాళ్లు ఈ భేటీలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా నియామకాల ప్రక్రియ మొదలవుతుంది. అలాగే ఇప్పటికే పూర్తయిన పరీక్షల ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నది. అలాగే గ్రూప్-1,2,3 పరీక్షలతో పాటు సర్వీస్ కమిషన్ పరిధిలో ఉన్న మిగిలిన పరీక్షల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నది. అయితే గ్రూప్-1 పరీక్ష రద్దు అంశం కోర్టు పరిధిలో ఉన్నది. పరీక్ష రద్దు చేసి తిరిగి నిర్వహించాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్‌కూడా సమర్థించింది. దీన్ని సవాల్ చేస్తూ కమిషన్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఒకవేళ గ్రూప్-1 ప్రక్రియను యథాతథంగా కొనసాగించాలని భావిస్తే కోర్టు తీర్పు వచ్చే వరకు వేచిచూడాలి. లేదా తిరిగి నిర్వహించాలని అనుకుంటే కోర్టులో వేసిన కేసు వాపస్ తీసుకోవాలి. కొత్త కమిషన్ ఏర్పాటయ్యాక దీనిపై స్పష్టత వస్తుంది.
పాత ప్రక్రియ కొనసాగింపునకే అవకాశాలు
ఇప్పటికే వచ్చిన నోటిఫికేషన్ల ప్రక్రియను కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, పాత జీవో ప్రకారమే వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్లలో పోస్టులు తక్కువగా ఉన్నాయని నిరుద్యోగులు నిరాశలో ఉన్నారు. పోస్టులు తక్కువ, పోటీ పడేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నది. నిరుద్యోగుల అభ్యర్థనను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం కూడా పోస్టుల సంఖ్య పెంచుతామని ఎన్నికల సమయంలోనే చెప్పింది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా పాత వాటికి అనుబంధం నోటిఫికేషన్లను కమిషన్ విడుదల చేయనున్నది. అప్పుడే గతంలో దరఖాస్తు చేసుకోనివారు, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు ఎడిట్ చేసుకునే వెసులుబాటు దక్కుతుంది.
జాబ్ క్యాలెండర్ ప్రకటన.. తీరనున్న సిబ్బంది కొరత
ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంతో నిరాశలో ఉన్న నిరుద్యోగులకు వారి మనోస్థైర్యం దెబ్బతినకుండా భరోసా కల్పించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నది. దీనివ్లల ప్రిపేర్ అయ్యే వాళ్లంతా తిరిగి విశ్వాసంతో ప్రిపరేషన్ కొనసాగిస్తారు. ఏళ్ల తరబడి కష్టపడి చదువుతున్న వాళ్లందరికీ న్యాయం జరుగుతుంది.
కమిషన్‌లో సిబ్బంది కొరత లేకుండా చూస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ రానున్నది. సర్వీస్ కమిషన్‌లో సిబ్బంది కొరత ఉన్నది. దీన్ని సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లడంతో పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, పరీక్షల ఫలితాలు, ఇంటర్వ్యూలు నిర్వహించడం వంటివి పారదర్శకంగా, పకడ్బందీగా చేపట్టడానికి అవసరమైన సిబ్బందిని నియమిస్తామని చెప్పింది. ఇప్పుడు గ్రూప్-3 కింద ఆ పోస్టులను మంజూరు చేయనున్నది. అయితే ప్రస్తుతం ప్రక్రియ కొనసాగించడానికి వీలువగా వివిధ డిపార్ట్‌మెంట్ల నుంచి సెక్షన్ ఆఫీసర్లను ప్రభుత్వం డిప్యూటేషన్‌పై పంపించే అవకాశాలున్నాయి. ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం కొత్త ఏడాదిలో కొత్త కమిషన్ ఏర్పాటు అవుతుంది. కొలువుల ప్రక్రియ కూడా వేగవంతం కానున్నది.