కేసీఆర్‌కు పేరొస్తుందనే ఆ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు

  • Publish Date - February 21, 2024 / 12:06 PM IST

  • పాలమూరు లిఫ్టు కాలువలతో లక్షన్నర ఎకరాలకు సాగునీరు
  • భేషజాలకు పోతున్న రేవంత్‌ సర్కార్‌
  • మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు

విధాత, హైదరాబాద్‌ : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కాలువలు చేపడితే లక్షన్నర ఎకరాలకు సాగు నీళ్లు వస్తాయని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బేషజాలకు పోయి కేసీఆర్‌కు పేరొస్తుందన్న అక్కసుతో పాలమూరు పరిధిలో కాలువలు పూర్తి చేయట్లేదని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని రేవంత్ రెడ్డి సర్కార్ జేషజాలకు పోతుందని అరోపించారు.

కొడంగల్ ప్రాజెక్టు పూర్తి కావడానికి చాలా సమయం పడుతోందని, అదే పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేస్తే 12.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందుతాయని పేర్కొన్నారు. 12 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి కాలువలు పూర్తి చేసి కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేస్తే అధిక లబ్ధి జరుగుతుందని తెలిపారు. జూరాల ప్రాజెక్ట్ పరిధి అయుకట్టు 5.7 లక్షల ఎకరాలు మాత్రమేనన్నారు. జూరాల ఎత్తిపోతలలో నీళ్లు ఇప్పుడున్న రైతులకు సరిపోవని తెలిపారు. బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పరిధి రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొన్నదని అన్నారు. ఈ పరిస్థితుల్లో కొడంగల్ ఎత్తిపోతలకు జూరాలపై ఆధారపడితే మిగతా ప్రాజెక్టులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. వాటిని అధిగమించాలంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కాలువలు చేపట్టాలన్నారు.

Latest News