Site icon vidhaatha

ఆ మ‌హిళ హోట‌ల్ బిల్లు రూ. 6 ల‌క్ష‌లు.. అకౌంట్‌లో ఉన్న‌ది రూ. 41

న్యూఢిల్లీ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ మ‌హిళ ఢిల్లీలోని ఓ విలాస‌వంత‌మైన హోట‌ల్‌లో 15 రోజుల పాటు గ‌డిపారు. ఆ 15 రోజుల పాటు ల‌గ్జ‌రీ లైఫ్‌ను ఎంజాయ్ చేశారు. ఇష్ట‌మైన ఆహారంతో పాటు అన్ని సౌక‌ర్యాల‌ను అనుభ‌వించారు. చివ‌ర‌కు స్పా సౌక‌ర్యాన్ని కూడా వినియోగించుకున్న ఆమెకు 15 రోజుల‌కు రూ. 6 ల‌క్ష‌ల బిల్లు వ‌చ్చింది. కానీ ఆవిడ అకౌంట్‌లో ఉన్న‌ది మాత్రం కేవ‌లం రూ. 41 మాత్ర‌మే. ఈ విష‌యాన్ని హోట‌ల్ నిర్వాహ‌కులు పోలీసుల దృష్టికి తీసుకెళ్ల‌గా, ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు వెలుగు చూశాయి.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఏపీకి చెందిన ఝాన్సీరాణి అనే మ‌హిళ‌.. ఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న ఫుల్‌మాన్ హోట‌ల్‌లో గ‌తేడాది డిసెంబ‌ర్‌లో 15 రోజుల పాటు ఉండేందుకు ఓ గ‌దిని బుక్ చేసుకున్నారు. 15 రోజుల పాటు ఆమె హోట‌ల్‌లో బ‌స చేయ‌గా, బిల్లు రూ. 5,88,176 అయింది. స్పా సౌక‌ర్యం కోసం ఏకంగా రూ. 2.11 ల‌క్ష‌లు ఖర్చు చేశార‌మె.

హోట‌ల్‌ను వెకేట్ చేసే స‌మ‌యంలో ఓ యూపీఐ యాప్ ద్వారా డ‌బ్బులు పంపిన‌ట్లు సిబ్బందికి స‌ద‌రు మ‌హిళ చూపించారు. కానీ బ్యాంకు ఖాతాలో డ‌బ్బులు జ‌మ కాక‌పోవ‌డంతో, హోట‌ల్ నిర్వాహ‌కులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెను జ‌న‌వ‌రి 13వ తేదీన‌ అరెస్టు చేసి విచారించారు. ఆమె ఉప‌యోగించిన బ్యాంకు అకౌంట్ ఫేక్ అని తేలింది. ఆమె ఖాతాలో కేవ‌లం రూ. 41 మాత్ర‌మే ఉన్న‌ట్లు గుర్తించారు పోలీసులు.

అయితే ఝాన్సీరాణి త‌న పేరును ఇషా దేవ్‌గా పేర్కొంటూ న‌కిలీ ఐడీ కార్డును సృష్టించిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఆ కార్డును చూపించి హోట‌ల్‌లో బ‌స చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఇక బ్యాంకు ఖాతాల వివ‌రాలు ఇవ్వ‌డంలో ఆమె స‌హ‌క‌రించ‌లేద‌ని పేర్కొన్నారు. ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశామ‌ని, పూర్తి వివ‌రాల కోసం ఏపీ పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తామ‌ని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇక తాను, త‌న భ‌ర్త డాక్ట‌ర్ల‌మ‌ని, న్యూయార్కులో ఉంటామ‌ని చెప్పిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు స‌మీపంలో స‌ద‌రు మ‌హిళ అన్ని రోజులు ఎందుకు ఉండాల్సి వ‌చ్చింద‌నే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు.

Exit mobile version