Site icon vidhaatha

కాంగ్రెస్ పార్టీలో చేరిన వైెఎస్ షర్మిల


విధాత‌: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్‌ షర్మిల గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ అధినేత మల్లికార్జున్‌ ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఇత‌ర సీనియ‌ర్ నేత‌ల‌ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే మూడు రంగుల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల మాట్లాడుతూ.. రాహుల్‌ని ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి క‌ల అని పేర్కొన్నారు. తన వైఎస్‌ఆర్‌ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు. తనకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా నెరవేరుస్తానని చెప్పారు.


అతిపెద్ద సెక్యులర్ పార్టీ

‘ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం చాలా సంతోషంగా ఉన్న‌ది. నేటి నుంచి భారత జాతీయ కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ భాగస్వామ్యమవడం నాకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తోంది’ అని ఆమె మీడియాతో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మన దేశంలో అతిపెద్ద లౌకిక పార్టీ అని తెలిపారు. భారతదేశ నిజమైన సంస్కృతిని కాంగ్రెస్ సమర్థిస్తుంద‌ని పేర్కొన్నారు. మన దేశ‌ పునాదులను కాంగ్రెస్ పార్టీయే నిర్మించిద‌ని వెల్ల‌డించారు. అనంత‌రం ఆమె పార్టీ మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకున్నారు.


గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు నుంచీ ష‌ర్మిల కాంగ్రెస్‌లో చేరే అవ‌కాశాల‌పై చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఎన్నిక‌ల త‌ర్వాత ఆమె కాంగ్రెస్‌లో చేరుతార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఆమె గురువారం ఎట్ట‌కేల‌కు కాంగ్రెస్‌లో చేరారు. ఆమెకు ఏపీ బాధ్య‌త‌లు అప్ప‌టిస్తార‌ని స‌మాచారం. అయితే.. పార్టీ అధ్య‌క్షురాలిని చేస్తారా? అన్న విష‌యంలో ఊహాగానాలు ఉన్నాయి. అదే జ‌రిగితే రాబోయే ఎన్నిక‌ల్లో ఏపీలో అన్న వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఆమె ఎదుర్కోనున్నారు.

Exit mobile version