SBI Amrit Vrishti Scheme | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్తగా అమృత్ వృష్టి అనే కొత్త ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం పరిమిత కాలానికి మాత్రమే.. పెట్టుబడి మొత్తంపై అధిక వడ్డీ రేట్ల రాబడిని అందిస్తున్నది. 400 రోజుల కన్నా ఎక్కువ రోజులు ఎఫ్‌డీ స్కీమ్‌పై వడ్డీ ఎంత ఆఫర్ చేస్తుందో తెలుసుకుందాం రండి..!
ఎస్బీఐ 444 రోజుల వ్యవధిలో పెట్టుబడి మొత్తంపై సాధారణ పౌరులకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం అధిక వడ్డీని అందజేస్తున్నది. ఈ పథకం 15 జూలై 2024 నుంచి 31 మార్చి 2025 వరకు పెట్టుబడికి అందుబాటులో ఉన్నది. ఈ స్కీంలో మీరు రూ.3 కోట్ల వరకూ డిపాజిట్ చేసుకునే వీలున్నది. రూ.కోటి డిపాజిట్ చేస్తే దీనిపై మీకు 444 రోజులకు సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.75 శాతం కింద రూ.10 లక్షల వరకు ఆదాయం లభించనున్నది. ఎస్‌బీఐ తరహాలోనే మరికొన్ని బ్యాంకులు సైతం ఎఫ్‌డీ స్కీమ్‌ని తీసుకువచ్చాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) 400 రోజుల కాలానికి సాధారణ డిపాజిటర్లకు 7.30 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నది.
కెనరా బ్యాంక్ సాధారణ పౌరులకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని 444 రోజుల కాలానికి వడ్డీ చెల్లిస్తున్నది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 399 రోజుల ఎఫ్‌డీపై సాధారణ పౌరులకు 7.25శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటును చెల్లిస్తున్నది. బ్యాంక్ ఆఫ్ బరోడా 399 రోజుల మాన్‌సూన్ ధమాకా యోజనపై సాధారణ పౌరులకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని ఇస్తున్నది. ఇక పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సాధారణ పౌరులకు అత్యధికంగా 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ రేటును చెల్లిస్తున్నాయి.