Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (జూలై 23న) పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇవాళ ఉదయం సరిగ్గా 11 గంటలకు ఆమె లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం మొదలు పెడుతారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలమ్మ.. ఈసారి కూడా నిస్సారమైన బడ్జెట్‌నే ప్రజల ముందుకు తేనుందా.. లేదంటే ఈ బడ్జెట్‌తో భారత ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్ ఏమైనా ఇస్తుందా..? అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవాళ నిర్మలా సీతారామన్ షెడ్యూల్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 8:40 గంటలకు తన ఇంటి నుంచి కార్యాలయానికి బయలుదేరుతారు. ఉదయం 9 గంటలకు బడ్జెట్‌ను సిద్ధం చేసిన మంత్రిత్వ శాఖ బృందంతో ఆమె ఫోటో సెషన్ ఉంటుంది. ఆ తర్వాత బడ్జెట్‌కు రాష్ట్రపతి ఆమోదం కోసం ఆమె రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి బడ్జెట్‌తో పార్లమెంటుకు చేరుకుంటారు. అక్కడ మరో ఫోటో సెషన్ ఉంటుంది. బడ్జెట్‌కు ముందు రెండుసార్లు ఫొటోలు దిగే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. అనంతరం ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగం చేస్తారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ సమర్పణ అనంతరం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ బడ్జెట్‌పై తన స్పందనను తెలియజేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు బడ్జెట్‌కు సంబంధించి ఆర్థిక మంత్రి తన బృందంతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బడ్జెట్‌పై లోక్‌సభ, రాజ్యసభల్లో 20 గంటలపాటు చర్చ జరుగుతుంది.
ఆయుస్మాన్ యోజనపై ప్రకటన చేసేనా..?
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్థికవృద్ధి రేటును 6.5 నుంచి 7 శాతంగా అంచనా వేశారు. గత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24లో ఇది 8.2 శాతంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేస్తూ.. 70 ఏళ్లు పైబడిన పౌరులందరికీ 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స కోసం ఆయుష్మాన్ యోజన పరిధిలోకి తీసుకువస్తామని ప్రధాని మోడీ చెప్పారు. పెట్టుబడి ద్వారా ప్రజలకు గౌరవం, మెరుగైన జీవితం, ఉపాధి కల్పించడంపై పార్టీ దృష్టి ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఆ ప్రకటనను నెరవేరుస్తుందని ప్రజలు భావిస్తున్నారు.
అదేవిధంగా బడ్జెట్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ కోసం ప్రభుత్వం మరిన్ని నిధులను కూడా విడుదల చేయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త నిధుల విడుదలతో 2025 మార్చి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 31.4 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అనేది మోడీ ప్రభుత్వం ప్రధాన పథకం. అందరికీ ఇళ్లు అనే ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మార్చి 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 2.95 కోట్ల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2016 నవంబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి దేశంలో 2.63 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది.
పన్ను శ్లాబ్‌లు మారేనా..?
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో బడ్జెట్‌లో టాక్స్ ఫ్రంట్‌పై రిలీఫ్ గురించి అడిగినప్పుడు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్‌ఐపిఎఫ్‌పి) ప్రొఫెసర్ ఎన్‌ఆర్ భానుమూర్తి మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపుతాయని తాను అనుకోవడం లేదని అన్నారు. కానీ ప్రత్యక్ష పన్ను విధానం ప్రభావితం అవుతుందని చెప్పారు. ప్రైవేట్ వినియోగం ఆందోళన కలిగించే విషయం కాబట్టి, ముఖ్యంగా పన్ను వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నప్పుడు జీఎస్టీ కౌన్సిల్ దాని రేట్లను తగ్గించడాన్ని పరిగణించాలని, ప్రభుత్వం పన్ను శ్లాబ్‌లో పెద్ద మార్పులు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
వృద్ధులకు రైలు టికెట్లలో రాయితీని పునరుద్ధరించేనా..?
ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు పెద్ద ఊరటనిస్తుందని భావిస్తున్నారు. దీని కోసం, రైలు టిక్కెట్లపై వారికి ఇచ్చిన 50 శాతం తగ్గింపును పునరుద్ధరించవచ్చు. కోవిడ్‌కి ముందు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైలు టిక్కెట్‌లపై పురుష సీనియర్ సిటిజన్‌లు 40 శాతం వరకు, మహిళా సీనియర్ సిటిజన్‌లు 50 శాతం వరకు రాయితీని పొందేవారు. 2019 చివరి వరకు IRCTC దురంతో, శతాబ్ది, జన శతాబ్ది, రాజధాని, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల రైలు టిక్కెట్లపై రాయితీలను అందించించారు. ఉదాహరణకు రాజధాని రైలులో మొదటి ఏసీ టికెట్ ధర రూ.4,000 అయితే సీనియర్ సిటిజన్లకు ఇది కేవలం రూ.2,000 లేదా 2,300 మాత్రమే.
రైతులకు పెద్ద ఊరటనిచ్చేనా..?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వాయిదాను ప్రభుత్వం పెంచవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద ప్రభుత్వం ఏటా రూ.6000 అందజేస్తున్నది. ఇది మూడు విడతలుగా ఖాతాలోకి వస్తుంది. దీన్ని ప్రభుత్వం రూ.10,000 వరకు పెంచవచ్చు. అయితే ఈసారి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డుపై రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచవచ్చు. ఇది మాత్రమే కాదు ప్రభుత్వం ఎటువంటి సెక్యూరిటీ లేకుండా రుణ పరిమితిని రూ.1,60,000 నుండి రూ.2,60,000కి పెంచే ఛాన్స్ ఉంది.