డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు పెరిగాయి. ఒకే రోజు పెద్ద మొత్తంలో అంటే రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేస్తే దానిపై ఆదాయ పన్ను శాఖ ఫైన్ వేస్తోంది. పరిమితికి మించి డబ్బులు తీసుకుంటే వంద శాతం డబ్బులు కోల్పోయే అవకాశం ఉంది. అసలు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 269 ST అంటే ఏంటి? దీని గురించి తెలుసుకుందాం.
రోజకు ఎంత నగదు స్వీకరించవచ్చు
రోజులో ఒక వ్యక్తి రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదును తీసుకొనే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ నగదును ఎవరైనా స్వీకరిస్తే తీసుకున్న మొత్తం కోల్పోయే అవకాశం ఉంది.అంటే వంద శాతం ఫైన్ ను విధిస్తారు. ఉదహరణకు మీకు రూ. 3 లక్షలు స్వీకరిస్తే ఈ మూడు లక్షలపై వంద శాతం ఫైన్ విధిస్తారు. అంటే మీకు వచ్చిన ప్రతి రూపాయిని మీరు కోల్పోతారు. ఆదాయ పన్ను శాఖ 1961 సెక్షన్ 269ST సెక్షన్ ఒకే వ్యక్తి నుంచి ఒకే లావాదేవీ లేదా వేర్వేరు ఖాతాల ద్వారా రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదును స్వీకరిస్తే వంద శాతం ఫైన్ చెల్లించాల్సిందే. అంతేకాదు ఒకే ఈవెంట్ లేదా కార్యక్రమానికి సంబంధించి వేర్వేరు తేదీల్లో రూ. 2 లక్షల కంటే ఎక్కువ నగదును స్వీకరించినా కూడా ఫైన్ విధిస్తారు. ఉదహరణకు మీ ఇంట్లో ఫంక్షన్ కు టెంట్ కోసం రూ. 2.50 లక్షలకు పైగా ఖర్చు అయిందనుకుందాం. అయితే దీనికిగాను వేర్వేరు తేదీల్లో డబ్బులు చెల్లించినప్పటికీ ఇది ఈ సెక్షన్ ఉల్లంఘన కిందకే వస్తోంది.
మినహాయింపులు ఏమైనా ఉన్నాయా?
బ్యాంకులు, పోస్టాఫీసుల నుండి ఉపసంహరణలకు ఈ నగదు ఉపసంహరణ పరిమితి వర్తించదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) స్పష్టం చేసింది.అందువల్ల సెక్షన్ 269ST లోని నిబంధనలు వీటికి వర్తించవు అకౌంట్ పేయీ చెక్కు లేదా అకౌంట్ పేయీ బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా అందుకున్న నగదు లేదా బ్యాంక్ ఖాతా ద్వారా ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ECS) వాడకం.
ప్రభుత్వం, ఏదైనా బ్యాంకింగ్ కంపెనీ, పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంక్ లేదా సహకార బ్యాంకు నుండి ఏదైనా రసీదు.
సెక్షన్ 269SS లో ప్రస్తావించిన సహజ లావాదేవీల విషయంలో ఇబ్బందులుండవు.
ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన విషయంలో మినహాయింపులున్నాయి. రూ. 2 లక్షల కంటే ఎక్కువ లావాదేవీల విషయంలో చెక్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, యూపీఐ పద్దతులను ఉపయోగించాలని ట్యాక్స్ నిపుణులు సూచిస్తున్నారు.
తప్పుడు వివరాలు అందిస్తే ఫైన్
ఆదాయ వివరాలను దాచిపెట్టడం లేదా తప్పుడు ఆదాయ వివరాలను అందిస్తే ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 271 ప్రకారం జరిమానా విధిస్తారు. పన్ను చెల్లింపుదారుడు పన్నును ఎగవేసే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా ఆదాయాన్ని దాచిపెట్టాడని సూచించడానికి ‘స్పష్టమైన ఆధారాలు’ ఉన్నప్పుడు మాత్రమే జరిమానా విధిస్తారు. ఈ సెక్షన్ ప్రకారం పన్ను ఎగవేసినందుకు 300 శాతం ఫైన్ విధించే అవకాశం ఉంది. పన్ను చెల్లించకుండా దాచిపెట్టారని ఆదాయపన్ను శాఖ అధికారులు నమ్మితే జరిమానా విధిస్తారు. అయితే ఉద్దేశపూర్వకంగా తప్పు చేయకపోతే ఈ సెక్షన్ కింద ఫైన్ విధించే అవకాశాలు లేవు. జరిమానా విధించడానికి ఆదాయ పన్ను శాఖ అధికారి నిర్ధిష్టమైన కారణాలను చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ కారణాలు చెప్పకుండా ఫైన్ విధిస్తే చట్టపరంగా అది నిలబడదు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో పొరపాటు చేస్తే దాన్ని ఉద్దేశపూర్వకంగా ఆదాయం చూపకుండా దాచిపెట్టడం కిందకు రాదు.