LIC Policy Surrender Best Practices | జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే లాభమా? నష్టమా?

జీవిత బీమా పాలసీని సరెండర్ చేయవచ్చా? సరెండర్ చేస్తే లాభమా? నష్టమా? ఎన్ని సంవత్సరాల తర్వాత పాలసీని సరెండర్ చేయవచ్చు? అసలు పాలసీని సరెండర్ చేయడం వల్ల మీరు కట్టిన డబ్బులు ఏ మేరకు తిరిగి వస్తాయి? పాలసీ సరెండర్ చేయకుండా ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.

LIC Policy Surrender Best Practices | జీవిత బీమా పాలసీని సరెండర్ చేయడం అంటే ఒక రకంగా చెప్పాలంటే పాలసీని రద్దు చేసుకోవడమే. సాధారణంగా మీరు తీసుకున్న పాలసీ కాల పరిమితి ముగిసిన తర్వాత పాలసీ రద్దు అవుతుంది. కానీ, పాలసీ సరెండర్ చేస్తే కాల పరిమితితో సంబంధం లేకుండా పాలసీ వెంటనే రద్దు అవుతుంది. పాలసీని సరెండర్ చేయడం వల్ల పాలసీ ద్వారా లభించే కవరేజీ అంటే బీమా కూడా రద్దు అవుతుంది. బీమా ద్వారా లభించే సౌకర్యాలు కూడా రావు. అయితే పాలసీని సరెండర్ చేయడంతో అప్పటివరకు మీరు చెల్లించిన ప్రీమియంలో కొంత మీకు తిరిగి చెల్లించే అవకాశం ఉంది. అయితే ఇది ఆయా పాలసీలపై ఆధారపడి ఉంటుంది.

పాలసీ సరెండర్ చేస్తే లాభమా? నష్టమా?

బీమా చేసిన పాలసీ ఆధారంగా పాలసీ సరెండర్ చేసే సమయంలో నిబంధనలు మారుతూ ఉంటాయి. కాలపరిమితి కంటే ముందుగానే పాలసీని సరెండర్ చేస్తే పాలసీ చేసిన వ్యక్తి నష్టపోతారు. ఇప్పటివరకు పాలసీ కోసం చెల్లించిన ప్రీమియంలో ముప్పై శాతాన్ని సరెండర్ విలువగా నిర్ణయిస్తారు. పాలసీ తీసుకొని పదేళ్లు దాటితే వాటికి సరెండర్ విలువ జీరో. పాలసీ సరెండర్ చేయగానే డిపాజిట్, మెచ్యూరిటీపై బోనస్ వంటి ప్రయోజనాలు కూడా పాలసీదారుడు కోల్పోతారు. పాలసీ కోసం చెల్లించే ప్రీమియాన్ని ఆదాయపన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. పాలసీ సరెండర్ చేస్తే పాలసీ ద్వారా లభించే బీమా ప్రయోజనాలు కూడా అందవు. పాలసీ సరెండర్ వాల్యూ ప్రకారం ఆర్ధికంగా తాత్కాలికంగా ప్రయోజనం కలగవచ్చు. కానీ, పాలసీ ద్వారా లభించే అన్ని ప్రయోజనాలు దక్కవు.

ఈ విషయాలు తెలుసుకోవాలి

బీమా పాలసీ ఎంత ఎక్కువ కాలం ఉంటే సరెండర్ విలువ అంత ఎక్కువగా ఉంటుంది. హోల్ లైఫ్, ఎండ్ మెంట్ పాలసీలు సరెండర్ విలువను అందిస్తాయి. పాలసీని సరెండర్ చేస్తే మీకు ఎంత నగదు వస్తుంది, పాలసీని తాకట్టు పెట్టి రుణం తీసుకుంటే ఎకంత వస్తుందో తెలుసుకోవాలి. అప్పుడు సరెండర్ విషయమై నిర్ణయం తీసుకోవాలి. ఎక్కువ పాలసీలుంటే సరెండర్ చేయడంలో ఇబ్బంది లేదు. కాలపరిమితికి ముందే పాలసీని సరెండర్ చేయడంతో కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు సరెండర్ చార్జీలు కూడా వసూలు చేస్తాయి. అప్పుడు మీకు వచ్చే వచ్చే చెల్లించే మొత్తం తగ్గిపోయే అవకాశం ఉంది.

ప్రత్యామ్నాయాలున్నాయా?

ఆర్ధికంగా తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనో, ఇతరత్రా కారణాలతో పాలసీలను సరెండర్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆర్ధిక అవసరాల కోసమే పాలసీని సరెండర్ చేయాలనుకుంటే… సరెండర్ బదులు పాలసీ ఆధారంగా లోన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ రుణం తీర్చలేకపోతే పాలసీ కాలపరిమితి పూర్తైన తర్వాత వచ్చే డబ్బుల్లో రుణంతో పాటు వడ్డీని మినహాయించుకుని మిగిలిన డబ్బులను మీ ఖాతాలో ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తోంది. ఇన్సూరెన్స్ పాలసీని అమ్మడం కూడా మరో పద్దతి.