టి20 ప్రపంచకప్ 2026: ఇంగ్లండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ – ఫైనల్లో న్యూజీలాండ్​తో ఢీ.!

టి20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్లో సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. జాకబ్ బెథెల్ సెంచరీతో ఇంగ్లండ్ చివరి వరకు పోరాడినా 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి వరుసగా రెండోసారి ఫైనల్లోకి ప్రవేశించింది.

India players celebrate crucial Jacob Bethell run-out during India vs England T20 World Cup 2026 semifinal

సెమీఫైనల్‌లో కీలక సమయంలో జాకబ్ బెథెల్ రనౌట్ కావడంతో సంబరాల్లో మునిగిన భారత ఆటగాళ్లు.

India Beat England by 7 Runs After Samson Blitz, Reach T20 World Cup Final

సారాంశం:

టి20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్లో సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ 253 పరుగుల భారీ స్కోరు చేసింది. జాకబ్ బెథెల్ సెంచరీతో ఇంగ్లండ్ చివరి వరకు పోరాడినా 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో భారత్ వరుసగా రెండోసారి టి20 ప్రపంచకప్ ఫైనల్లోకి చేరి న్యూజీలాండ్తో టైటిల్ పోరుకు సిద్ధమైంది.

విధాత క్రీడా విభాగం | 5 మార్చి 2026 | హైదరాబాద్​:

టి20 ప్రపంచకప్​ ఫైనల్లోకి భారత్​ ఘనంగా ప్రవేశించింది. టాస్​ ఓడి బ్యాటింగ్​ చేసిన భారత్​ నిర్ణీత 20 ఓవర్లలో 253 పరుగుల భారీ స్కోరు చేసి, ఇంగ్లండ్​కు గట్టి సవాల్​ విసిరింది. ప్రతిగా ఇంగ్లండ్​ పట్టుదలతో పోరాడి 246 పరుగులకు తన ఇన్నింగ్స్​ను ముగించి, భారత్​కు 7 పరుగుల విజయాన్ని అందించింది. దీంతో టి20 ప్రపంచకప్​లో వరుసగా రెండోసారి ఫైనల్లో ప్రవేశించిన భారత్​, ఈనెల 8న అహ్మదాబాద్​లోని నరేంద్రమోదీ స్టేడియంలో న్యూజీలాండ్​తో తలపడనుంది. గెలిస్తే 2సార్లు వరుసగా ప్రపంచకప్​ గెల్చుకున్న జట్టుగా భారత్​ చరిత్ర సృష్టిస్తుంది.

రెచ్చిపోయిన బెథెల్​ – గెలిచినంత పనిచేసిన ఇంగ్లండ్​

భారత్‌పై సెమీఫైనల్‌లో సెంచరీ సాధించిన ఇంగ్లండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్.

భారత్​ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ వీరోచిత పోరాటం చేసింది. పవర్​ప్లేలోనే 3 కీలక వికెట్లు చేజార్చుకున్నప్పటికీ, జాకబ్​ బెథెల్​ అలుపెరుగని పోరాటంతో సెంచరీ చేసి, జట్టును ఫైనల్​కు చేర్చడానికి శాయశక్తులా కృషి చేసాడు.

ఓపెనర్లు ఫిల్​ సాల్ట్(5)​, జాస్​ బట్లర్​లు ధాటిగా ఆరంభించినా, వెంటనే సాల్ట్​ అవుటవడంతో, వచ్చిన కెప్టెన్​ హ్యరీ బ్రూక్(7)​ను బుమ్రా బలితీసుకున్నాడు. కాసేపటికే డేంజరస్​ బట్లర్(25)​ను వరుణ్​ చక్రవర్తి క్లీన్​ బౌల్డ్​ చేయడంతో ఇంగ్లీష్​ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. కానీ అప్పుడొచ్చిన బెథెల్​ తనదైనా పట్టుదలతో పోరాడాడు. సిక్సులు, ఫోర్లతో చెలరేగిన బెథెల్​ 48 బంతుల్లో 105 పరుగులు సాధించాడు. దాదాపుగా గెలిపించినంత పనిచేసినంత బెథెల్​ పాండ్యా అద్భుతమైన త్రోకు రనౌట్​ అయ్యాడు. అయినా, సామ్​ కరన్​, విల్​ జాక్స్​, ఆర్చర్​ తమ బ్యాట్లకు పనిచెప్పడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి, కేవలం 7 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యారు.  భారత ఫీల్డింగ్​ అదిరిపోవడంతో ఒత్తిడికి లోనైన ఇంగ్లీష్​ బ్యాటర్లు భారీ షాట్లకు దిగి వికెట్లు ఇచ్చుకున్నారు. దీంతో భారత్​ వరుసగా రెండోసారి టి20 ప్రపంచకప్​ ఫైనల్లోకి ప్రవేశించింది.

భారత బౌలర్లలో హార్థిక్​ పాండ్యా 2 వికెట్లు తీసుకుని పొదుపుగా బౌలింగ్​ చేసాడు. బుమ్రా కూడా అత్యంత కట్టుదిట్టంగా బంతులేసి ఒక వికెట్​ తీసుకున్నాడు. ఇంకా, అర్షదీప్​, అక్షర్​ కూడా చెరో వికెట్​ తీసుకున్నారు. ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​గా మళ్లీ సంజూ శాంసన్​ ఎంపికయ్యాడు.

ముంబైలో పరుగుల సునామీ

వాంఖెడేలో మెరుపు ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడిన సంజూ శాంసన్.

అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనింగ్ మరోసారి ఆశించినంతగా కలిసిరాలేదు. అభిషేక్ శర్మ కేవలం 9 పరుగులకే అవుటయ్యాడు. అయితే సంజూ శాంసన్ మరోసారి అపద్బాంధవుడిలా ఆదుకుని ఇన్నింగ్స్‌కు ఊపిరి పోశాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి వేగంగా పరుగులు రాబట్టాడు. కిషన్ 18 బంతుల్లో 39 పరుగులు చేసి అవుటయ్యాడు.

తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన శివం దూబే కూడా ధాటిగా ఆడి 25 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎక్కువసేపు నిలవకపోయినా, చివర్లో హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) వేగంగా పరుగులు రాబట్టడంతో స్కోరు పరుగులెత్తింది.

ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మొత్తం 19 సిక్సర్లు బాదడం విశేషం. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు నమోదు చేసి ఇంగ్లండ్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది.

Latest News