Digital Gold Investment | భౌతికంగా బంగారాన్ని కొనుగోలు చేయకుండా ఆన్‌లైన్ లో కొనుగోలు చేసే బంగారాన్ని డిజిటల్ బంగారం అంటారు. ఈ బంగారం ఎవరు కొనుగోలు చేస్తారో అతడి పేరుతో బ్యాంకు ఖాతాలో భద్రపరుస్తారు. డిజిటల్ బంగారంపై కూడా జీఎస్టీ ఉంటుంది. అంతేకాదు 24 కారెట్ల రూపంలోనే ఈ బంగారాన్ని విక్రయిస్తారు. డిజిటల్ గోల్డ్ ను చిన్న చిన్న మొత్తాల్లో కొనుగోలు చేసే వెసులుబాటు కూడా ఉంది. 0.1 గ్రాముల బంగారం కూడా కొనవచ్చు. బంగారం నిల్వలను పెంచుకుంటూపోయే అవకాశం కూడా ఉంది. అయితే ఇటీవల కాలంలో డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు ఏకంగా 377 శాతం పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి.
ఎలా కొనుగోలు చేయాలి?
చాలా ఫిన్‌టెక్ ప్లాట్ ఫామ్ లు డిజిటల్ బంగారం కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తున్నాయి. రూ.1 తో కూడా డిజిటల్ బంగారం కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ బంగారాన్ని ఆన్ లైన్ లో అమ్ముకోవచ్చు. డిజిటల్ బంగారం వ్యాపారులు బంగారం తయారీదారులు లేదా విక్రయదారులతో ఒప్పందం చేసుకుంటాయి.2015లో భారత ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్లను ప్రవేశపెట్టింది. వీటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తోంది. ఈ బాండ్లకు ఎనిమిదేళ్ల కాలపరిమితి ఉంది. ఈ ఇన్వెస్ట్ మెంట్ ను నగదు రూపంలో తీసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ ల ద్వారా బంగారంలో పెట్టుబడులు పెట్టవచ్చు. బంగారంలో పెట్టుబడులు పెట్టే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతాయి. మీరు డీమ్యాట్ ఖాతాను ఓపెన్ చేయాలి. దీని ద్వారా మీరు బంగారంలో పెట్టుబడులు పెట్టవచ్చు. గోల్డ్ ఎఫ్ఓఎఫ్ ద్వారా కూడా బంగారంలో పెట్టుబడులు పెట్టే ఛాన్స్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ లలో మాదిరిగా పెట్టుబడులు పెట్టినట్టే ఎఫ్ఓఎప్ ద్వారా బంగారంలో పెట్టుబడులు పెట్టవచ్చు.
డిజిటల్ గోల్డ్ తో లాభ నష్టాలు ఏంటి?
డిజిటల్ బంగారానికి రక్షణ ఉంటుంది. దొంగలు ఎత్తుకుపోతారనే భయం ఉండదు. మీకు అవసరం ఉన్నప్పుడు ఈ బంగారాన్ని విక్రయించి డబ్బులు తీసుకోవచ్చు. లేదా ఈ బంగారంతో నగలు తయారు చేయించుకోవచ్చు. దీన్ని బంగారు నాణెలుగా కూడా మార్చుకోవచ్చు. ఒక్క గ్రాముకు తక్కువ బంగారం కూడా కొనుగోలు చేయవచ్చు. ఇక డిజిటల్ బంగారం విషయంలో నష్టాలు కూడా ఉన్నాయి. డిజిటల్ గోల్డ్ పై పెట్టుబడిపై నియంత్రణ లేదు. ఈ విషయమై నియంత్రణ ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని పలు సంస్థలు కోరాయి. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దేశంలో డిజిటల్ గోల్డ్ ఐదు శాతంగా ఉందని అంచనా. డిజిటల్ గోల్డ్ ను నగల తయారీ కోసం ఉపయోగించాలంటే పన్నులు భారంగా మారే అవకాశం ఉంది. డిజిటల్ బంగారం కొనుగోలు సమయంలో జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. నగల తయారీకి ఈ డిజిటల్ గోల్డ్ ను ఉపయోగిస్తే అప్పుడు కూడా జీఎస్టీ చెల్లించాల్సిందే. ఆన్ లైన్ లో కొన్ని మోసపూరిత యాప్స్ , వెబ్ సైట్స్ డిజిటల్ గోల్డ్ పేరుతో వల విసురుతాయి. ఇలాంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. మీరు పెట్టుబడి పెట్టిన సంస్థ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే పెట్టుబడులు పెట్టే సమయంలోనో, డిజిటల్ గోల్డ్ కొనుగోలు సమయంలో ఆ సంస్థ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.