Sanjay Daharia | క్యాన్సర్‌ను జయించి.. సివిల్స్‌ సాధించి.. విజేతగా నిలిచిన రైతుబిడ్డ

Sanjay Daharia | క్యాన్సర్‌తో పోరాడి మరీ తన కలను నెరవేర్చుకున్నాడో యువకుడు. తన జర్నీలో ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి సివిల్స్‌లో ర్యాంకు సాధించాడు. అతనే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సంజయ్ దహరియా.

Sanjay Daharia | క్యాన్సర్‌తో పోరాడి మరీ తన కలను నెరవేర్చుకున్నాడు ఓ యువకుడు! మహమ్మారి కారణంగా చూపు మందగించినా.. వినికిడి తగ్గినా.. పక్షవాతం వంటి సమస్యలు ఎదురైనా తన లక్ష్యాన్ని మాత్రం వదిలేయలేదు. అచంచలమైన సంకల్పంతో కష్టాలను జయిస్తూ ముందుకు సాగి.. చివరకు సివిల్ సర్వీసెస్‌లో ర్యాంకు సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సంజయ్ దహరియా ఆలిండియా 946వ ర్యాంకు సాధించి తన కలను నిజం చేసుకున్నాడు.

ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లా బేల్‌టుక్రి గ్రామానికి చెందిన సంజయ్ దహరియా సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాడు. అనంతరం రాయ్‌పూర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయానికి ఎంపికయ్యాడు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆ సమయంలోనే సివిల్స్ సాధించాలని లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. కానీ అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జాబ్ చేయడం అనివార్యమైపోయింది. అందుకే తన కలను పక్కనబెట్టి కుటుంబపోషణ కోసం ఉద్యోగాల వేటలో పడ్డాడు. ఎస్‌బీఐలో ఉద్యోగం సాధించాడు. 2009 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్‌లో పనిచేశాడు. మూడేళ్ల జాబ్ తర్వాత ఆర్థికంగా కాస్త స్థిరపడ్డామని భావన కలిగిన తర్వాత తన కలను నిజం చేసుకోవాలని సంజయ్ భావించాడు. ఈ క్రమంలోనే 2011లో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సివిల్స్‌కు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాడు. కానీ ఇంతలోనే అతనికి ఊహించని షాక్ తగిలింది. తాను క్యాన్సర్ బారినపడినట్లు 2012లో తెలిసింది.

అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న తరుణంలో క్యాన్సర్ బారిన పడినట్లు తెలియడంతో సంజయ్ కళ్ల ముందు అంతా చీకట్లు కమ్మేసినట్లు అనిపించింది. కానీ తొందరగానే ఆ డిప్రెషన్ నుంచి తేరుకున్నాడు. తన కలను సిద్ధం చేసుకునేందుకు క్యాన్సర్ మహమ్మారితో పోరాటం చేశాడు. దాదాపు ఆరేళ్ల పాటు క్యాన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ, నాలుగు ఆపరేషన్లు చేయించుకున్నాడు. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం భారీగా డబ్బులు ఖర్చవుతుండటంతో కుటుంబ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. కుటుంబ పోషణకు డబ్బులు కావాలి. దీంతో మరో బ్యాంకు జాబ్ వెతుక్కున్నాడు. దాని తర్వాత ఒక పోస్టాఫీసులో పనిచేశాడు. ఇలా ఒకవైపు జాబ్ చేస్తూనే.. మరోవైపు సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేరయ్యాడు. ఆ సమయంలో అతని ఆరోగ్యం ఏమాత్రం సహకరించలేదు. క్యాన్సర్ కారణంగా పాక్షికంగా వినికిడిలోపం వచ్చింది. చూపు మందగించింది. పక్షవాతం వంటి సమస్యలు కూడా ఎదురయ్యాయి. ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ సంజయ్ తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. నిరుత్సాహపడకుండా సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేరయ్యాడు. అలా 2022లో తొలిసారిగా సివిల్స్ పరీక్ష రాశాడు. కానీ అందులో విఫలమయ్యాడు. రెండో ప్రయత్నం కూడా కలిసిరాలేదు. ఈ క్రమంలోనే రెండు ప్రయత్నాల్లో విఫలమవ్వడానికి గల కారణాలను విశ్లేషించుకుని, లోపాలను సరిదిద్దుకుని, 2025లో మళ్లీ సివిల్స్ పరీక్ష రాశాడు. చివరకు విజయం సాధించాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆలిండియా 946వ ర్యాంకును సాధించాడు.

ఎట్టకేలకు తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంపై సంజయ్ దహరియా హర్షం వ్యక్తం చేశాడు. ” జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్నప్పుడు దానికి చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి ఉండేవారని.. ఆయన్ను చూసి నేను కూడా ఐఏఎస్ అవ్వాలని బలంగా ఫిక్సయ్యా. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా పలు ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. ” అని తెలిపారు. “సివిల్ సర్వీసెస్ ద్వారా దేశానికి సేవ చేయాలని ఆశిస్తున్నా. ఏ సర్వీస్ వచ్చినా ప్రజాసేవ విషయంలో నిబద్ధతగా వ్యవహరిస్తాను” అని చెప్పారు.

Latest News