Gardens of Hope | బస్తీ పిల్లల జీవితాలను మార్చిన 17 ఏళ్ల బాలుడు.. 42 మంది తల్లులతో కలిసి ఆర్గానిక్ కిచెన్ గార్డెన్లు!

Gardens of Hope | రోజూ చిప్స్, జంక్‌ఫుడ్ తింటూ పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సమస్యకు ఢిల్లీకి చెందిన 17 ఏళ్ల రాఘవ్ రాయ్ వినూత్న పరిష్కారం చూపించాడు. ఆ పిల్లల తల్లులను కలిసి ఇంట్లోనే కూరగాయల సాగుకు ఒప్పించాడు. ఇప్పుడు ఇంట్లోనే పిల్లలకు ఆర్గానిక్ ఆహారాన్ని అందిస్తున్నాడు.

Gardens of Hope | బస్తీ పిల్లల జీవితాలను మార్చిన 17 ఏళ్ల బాలుడు.. 42 మంది తల్లులతో కలిసి ఆర్గానిక్ కిచెన్ గార్డెన్లు!

Gardens of Hope | ఫుట్‌బాల్ నేర్పేందుకు బస్తీలకు వెళ్లిన ఓ 17 ఏళ్ల బాలుడి ఆలోచన ఇప్పుడు అక్కడి పిల్లల జీవితాల్లో ఆరోగ్యకరమైన మార్పు తీసుకొచ్చింది. రోజూ చిప్స్, జంక్‌ఫుడ్స్‌తో కడుపు నింపుకుంటూ పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల సమస్యకు అతను వినూత్న పరిష్కారం ఆలోచించాడు. పిల్లలకు మంచి ఆహారం అందించాలంటే ముందు వారి తల్లుల్లో మార్పు రావాలని.. వారితో ఇంటిపైనే కూరగాయలు పండించేలా ప్రోత్సహించాడు. గార్డెన్స్ ఆఫ్ హోప్ పేరిట కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయించాడు. అలా ఢిల్లీలోని 42 మంది తల్లులతో కలిసి పిల్లలకు మందులు లేని తాజా ఆర్గానిక్ ఆహారాన్ని అందిస్తున్నాడు.

పిల్లల పోషకాహార లోపం.. ఆలోచనలో పడేసింది

ఢిల్లీకి చెందిన రాఘవ్‌రాయ్‌ చిన్నతనంలోనే సామాజిక సేవపై ఆసక్తి పెంచుకున్నాడు. 2023 నుంచి “మోర్ దాన్ ప్లే” అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి సేవ చేస్తున్నాడు. ఈ సంస్థ క్రీడల ద్వారా పిల్లల్లో జీవిత నైపుణ్యాలు, విద్యపై అవగాహన పెంచడానికి కార్యక్రమాలు చేస్తోంది. దీంతో ఆ సంస్థతో కలిసి తనకు తెలిసిన ఫుట్‌బాల్‌ ఆటలో శిక్షణ ఇస్తున్నాడు. అలా తన దగ్గరకు ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌కు వచ్చే పిల్లలు చాలా బలహీనంగా ఉండటం, తొందరగానే అలసిపోవడం రాఘవ్ గుర్తించాడు. మార్కెట్‌లో తక్కువ ధరకు దొరికే చిప్స్, ప్యాకెట్ ఫుడ్స్, జంక్‌ఫుడ్ మాత్రమే తినడం గమనించిన అతను.. వాళ్లు అంత వీక్‌నెస్‌గా ఉండటానికి వారి ఆహారపు అలవాట్లే అని అర్థం చేసుకున్నాడు. వారికి పోషకాహారంపై అవగాహన లేకపోవడం వల్లే పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసి తీవ్రంగా ఆలోచించాడు.

రాఘవ్ రాయ్

అప్పుడే కిచెన్ గార్డెన్స్ ఏర్పాటుకు ఆలోచన

ఇదే విషయాన్ని మోర్ దాన్ ప్లే వ్యవస్థాపకుడు జైదీప్ భాటియాతో రాఘవ్ పంచుకున్నాడు. దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించాలని ఇద్దరూ కలిసి కొన్ని వారాలపాటు వారి బస్తీల్లో తిరిగారు. అక్కడి కుటుంబాల పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలించారు. చివరకు ఒక ఆలోచనకు వచ్చారు. వారి ఇంటి వద్దే కూరగాయలు పెంచేందుకు కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. అలా అయితేనే తక్కువ ధరలో బస్తీ పిల్లలకు పోషకాహారం అందుతుందని భావించారు.

రాఘవ్ వద్ద ఆలోచన ఉంది.. మోర్ దాన్ ప్లే సంస్థ దగ్గర నిధులు ఉన్నాయి. కానీ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయడానికి మహిళలను ఎలా ఒప్పించాలనేది పెద్ద సవాలుగా మారింది. మరీ ముఖ్యంగా వీరి ఇద్దరికీ కూడా వ్యవసాయంపై అవగాహన లేదు. అప్పుడే రాఘవ్ తనకు తెలిసిన అర్బన్ ఫార్మింగ్ నిపుణురాలు జూలీ సహాయం కోరాడు. రాఘవ్ చెప్పింది విన్న జూలీ కూడా.. బస్తీ పిల్లల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు వెంటనే ముందుకొచ్చింది. కిచెన్ గార్డెన్లపై పదేళ్లకు పైగా అనుభవం ఉన్న జూలీ.. రాఘవ్, జైదీప్‌తో కలిపి ఇంటింటికీ తిరిగి మహిళలను ఒప్పించే ప్రయత్నం చేశారు. మొదట్లో చాలామంది మహిళలు సందేహపడ్డారు.

ఇంటింటికీ తిరిగి కిచెన్ గార్డెన్‌పై అవగాహన కల్పిస్తున్న జూలీ

బస్తీ మహిళల నుంచి ఎన్నో అనుమానాలు

మా దగ్గర స్థలం లేదు.. సమయం లేదు.. ఇంట్లో కూరగాయలు ఎలా పెరుగుతాయని చాలామంది మహిళలు అనుమానం వ్యక్తం చేశారు. కానీ పాత ప్లాస్టిక్ క్రేట్లు, బాక్స్‌లు వాడి ఇంట్లోనే కూరగాయలు ఎలా పెంచుకోవచ్చో జూలీ వివరించింది. కంపోస్టు ఎరువు తయారీ, విత్తనాలు నాటడం, నీళ్లు పోయడం, మొక్కలు సంరక్షించడం వంటి విషయాల్లో వారికి శిక్షణ ఇచ్చింది. కానీ చాలామంది మహిళలు కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసేందుకు మాత్రం వెనుకడుగు వేశారు. అప్పుడే నిజాముద్దీన్ బస్తీలోని ఐదుగురు మహిళలు మాత్రం మొందుకొచ్చారు. దీంతో తొలుత వారి ఇళ్లపై కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి “గార్డెన్ ఆఫ్ హోప్” అని పేరు పెట్టారు. 2025 జనవరిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఐదుగురితో మొదలై.. 42 కుటుంబాల దాకా..

తొలుత ముందుకొచ్చిన ఐదుగురు మహిళల ఇళ్లపైనే కూరగాయల సాగు మొదలుపెట్టారు. మొదట పాలకూర, ముల్లంగి వంటి మొక్కలను పెంచడం ప్రారంభించారు. అది సక్సెస్ కావడంతో చుట్టుపక్కల మహిళలు కూడా కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చారు. అప్పుడు ఆ ఐదు కుటుంబాల ఇళ్లు శిక్షణ కేంద్రాలుగా మారాయి. అక్కడ తోటల పెంపకంపై ఇతర మహిళలకు వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ఆసక్తితో ముందుకొచ్చిన మహిళలకు ‘మోర్ దాన్ ప్లే’ సంస్థ విత్తనాలు, కంపోస్ట్ ఎరువు క్రేట్లు అందించారు. అలా ఐదు ఇళ్లతో ప్రారంభమైన ఈ గార్డెన్స్ ఆఫ్ హోప్ కార్యక్రమం ఇప్పుడు ఢిల్లీలోని నిజాముద్దీన్, సరాయ్ కాలేఖాన్, కుసుంపూర్ పహాడీ, అలీ విలేజ్ బస్తీల్లోని 42 ఇళ్లకు విస్తరించింది. నాలుగు బస్తీల్లోని మహిళలు పాలకూర, చోలే, వంకాయ, ముల్లంగి, మెంతికూర వంటివి పండిస్తున్నారు.

ఈ గార్డెన్స్ ఆఫ్ హోప్ కార్యక్రమం ద్వారా పిల్లల ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయి. ఇంతకుముందు బయట దొరికే చిప్స్, ప్యాకెట్ ఫుడ్ తిన్న పిల్లలకు.. వాళ్ల తల్లులు ఇంట్లో పండిన కూరగాయలు, ఆకుకూరలతోనే స్నాక్స్ చేసి ఇస్తున్నారు. అది చూసినప్పుడు తమ కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఆనందంగా ఉంటుందని రాఘవ్ తెలిపాడు.

కిచెన్ గార్డెన్ పెంచడంపై సదరు మహిళలు కూడా తమ అభిప్రాయలను పంచుకుంటున్నారు. ‘రాఘవ్ వచ్చి ఇంట్లోనే కూరగాయలు పెంచుకుందామని అన్నప్పుడు నవ్వొచ్చింది. కానీ ఇప్పడు మా ఇంటిమీద పాలకూర, చోలే, ముల్లంగి పండుతున్నాయి. బయట కొనాల్సిన అవసరం తగ్గింది. పైగా పిల్లలకు తాజా ఆర్గానిక్ ఆహారం ఇవ్వగలుగుతున్నా ‘ అని నిజాముద్దీన్‌కు చెందిన అఫ్రోజ్ జమాలా అనే మహిళ ఆనందం వ్యక్తం చేసింది. మొదటి కూరగాయ మొలిచిన రోజు అది తన బిడ్డలా అనిపించిందని చెప్పుకొచ్చింది.

‘మా ఇంట్లోనే పండించిన కూరగాయలతో నా కొడుక్కి భోజనం పెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. కూరగాయలను మా పక్కింటి వాళ్లో కూడా పంచుకుంటున్నా, ఇప్పుడు పొరుగువారితో మా అనుబంధం కూడా పెరిగింది’ అని 49 ఏళ్ల నిషాయెరా అల్వీ తెలిపింది.

Read More:

Terrace Garden | మట్టి లేకుండానే టెర్రస్‌పై గార్డెనింగ్.. సమ్మర్‌లో ఏసీ అవసరం లేకుండా చేసిన 70 ఏళ్ల వృద్ధుడి ఆలోచన!

Terrace Gardening | ఇంటి మేడపైనే కూరగాయల సాగు.. నెలకు 5వేలు ఆదా చేస్తున్న కేరళ గృహిణి