Site icon vidhaatha

Gold Price : బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

Gold

బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,12, 420 లకు చేరింది. అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి. ఈ ధరలు పెరగడానికి కారణం ఏంటి? దేశంలోని పరిస్థితులే బంగారంపై ప్రభావం చూపుతాయా? ప్రపంచంలోని పరిస్థితులు కూడా గోల్డ్ పై ప్రభావం చూపుతాయా? బంగారం ధరలు ఎప్పుడు అదుపులోకి రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. గత ఏడాది నుంచి పసిడి రేట్లు పరుగులు పెట్టింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1.12 లక్షలకు చేరింది. సామాన్యుడు బంగారం కొనే పరిస్థితి లేకుండా పోయింది. పెళ్లిళ్ల సమయంలో బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువ భాగం డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.

యుద్ధ భయాలు- అసాధారణంగా బంగారం పెరుగుదల

ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న అనిశ్చిత పరిస్థితులు, యుద్ధ వాతావరణం, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బంగారం ధరల పెరుగుదలకు కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని భావించినప్పుడు పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడి పెడుతారు. మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులున్న సమయంలో పెట్టుబడులు పెడితే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. బంగారంపై పెట్టుబడితే రిస్క్ ఉండదు. అందుకే బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం, మిడిల్ ఈస్ట్‌లో అనిశ్చిత పరిస్థితులు, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల స్టాక్ మార్కెట్లలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి. ఆర్ధి లేదా భౌగోళిక రాజకీయ సంక్షోభ సమయాల్లో బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తారు. ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గిన సమయంలో బంగారం మీద పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. డాలర్ విలువ తగ్గితే ఇతర కరెన్సీలు చలామణి చేసే వారికి బంగారం చౌకగా దొరుకుతుంది. డాలర్ విలువ పెరిగితే బంగారం రేటు పెరుగుతుంది. కేంద్ర బ్యాంకులు ద్రవ్యలోటును ఎదుర్కొంటున్నప్పుడు పెట్టుబడిదారులు తమ సంపదను కాపాడుకొనేందుకు బంగారంపై పెట్టుబడులు పెడతారు.

బ్యాంకుల్లో బంగారు నిల్వలు కూడా ధరలపై ప్రభావం

ప్రపంచంలోని పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు అంటే ఇండియాలోని రిజర్వ్ బ్యాంకు లాంటి బ్యాంకులు కూడా ఎక్కువగా బంగారం నిల్వలపై ఫోకస్ చేస్తున్నాయి. డాలర్ తో ఆయా దేశాల కరెన్సీల విలువ తగ్గిన సమయంలో వాటి ప్రభావం ఆ దేశాలపై ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయడం కోసం బంగారం నిల్వలపై పెట్టుబడులు పెడుతున్నాయి సెంట్రల్ బ్యాంకులు. డాలర్ తో రూపాయి మారకం విలువ ఇటీవల కాలంలో రికార్డు స్థాయిలో పతనమైంది. రూపాయి విలలువ పడిపోతే సురక్షితమైన పెట్టుబడి కింద బంగారంపై ఇన్వెస్ట్ చేస్తారు. భారత్ కూడా బంగారం నిల్వలపై ఫోకస్ చేస్తోంది. గత ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం ఇండియాలో 841.5 టన్నుల బంగారం ఉంది. ఇప్పుడు 880 మెట్రిక్ టన్నులకు చేరింది. విదేశాల్లో ఉన్న మన బంగారాన్ని ఇండియాకు తెస్తున్నారు. విదేశాల్లో మన బంగారం నిల్వలు 512 టన్నుల వరకు ఉన్నాయి. డాలర్ విలువ పెరిగిన సమయంలో బంగారం దిగుమతి చేసుకొంటే బంగారానికి ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. అంతేకాదు బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు పెరిగే అవకాశం ఉంది.

అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గుదల ఊహగానాలు

అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని ఊహగానాలు వెలువడుతున్నాయి. 50 బేసిస్ పాయింట్ల వరకు ఈ వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. దీని ప్రభావం బంగారం ధరల పెరుగుదలకు కారణమైంది. ప్రధాన కరెన్సీలపై డాలర్ విలువ 97.25 కి పడిపోయింది. ఇది ఇతర దేశాల కరెన్సీలను బలపడేలా చేస్తోంది. ఇది కూడా పరోక్షంగా బంగారం ధర పెరిగేందుకు కారణమైంది. అయితే ప్రపంచంలోని మార్కెట్లు స్థిరంగా ఉండాలి. అంతేకాదు ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించి, అన్ని దేశాల్లో మార్కెట్లలో ఒడిదొడుకులు లేకుండా చేస్తే బంగారం ధరలు అసాధారణ రీతిలో పెరగవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

 

Exit mobile version