విధాత : దుష్యంత్ , ఆషికా రంగనాథ్ జంటగా నటించిన కన్నడ, తెలుగు చిత్రం ‘గత వైభవం’ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో పూర్వజన్మలతో ముడిపడిన హీరోహీరోయిన్ల ప్రేమ కథతో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. సునీల్ కుమార్ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ‘గత వైభవం’ తెలుగులోనూ ఈ నెల 14న విడుదల కానుంది. సర్వెగర సిల్వర్ స్క్రీన్, సుని సినిమాస్ పతాకాలపై దీపక్ తిమ్మప్ప, సుని ఒక ఎపిక్ ఫాంటసీ డ్రామాగా ఈ సినిమాను నిర్మించారు.
తెలుగులో ‘అమిగోస్’, ‘నా సామి రంగ’ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన ఆషికా రంగనాథ్.. చిరంజీవి ‘విశ్వంభర’లోనూ ఓ కథానాయికగా చేసింది. విశ్వంభర సినిమా ఇంకా విడుదల కాలేదు. అయితే మిగతా రెండు సినిమాల తర్వాత ఆషికా నటించిన మూడో చిత్రంగా ‘గత వైభవం’ ఈ నెల 14న థియేటర్లలోకి రాబోతుంది. ఇదే రోజున నాగార్జున శివ రీరిలీజ్, దుల్కర్ సల్మాన్ ‘కాంత’తో పాటు సంతాన ప్రాప్తిరస్తు, జిగ్రిస్ తో పాటు పలు చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. మరి వీటితో పాటు పోటీలో నిలిచి ‘గత వైభవం’ ఏ మేరకు బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందో చూడాల్సి ఉంది.
