విధాత: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సినీ నటులు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ లు సిట్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ సీఐడీ కార్యాలయంలో వారి విచారణ కొనసాగింది. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై గతంలో నమోదైన కేసుల ఆధారంగా సిట్ దర్యాప్తు చేపట్టింది. పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖలో నమోదైన కేసుల ఆధారంగా విచారణ కొనసాగిస్తోంది. మొత్తం 29 మంది సినీనటులు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) నమోదు చేసిన సంగతి తెలిసిందే.
జంగిల్ రమ్మీ, జీత్‌విన్, లోటస్ 365.. తదితర బెట్టింగ్ యాప్‌లకు వారంతా ప్రమోషన్లు చేయడం వివాదాస్పదమైంది. వీరి ప్రమోషన్ల ప్రభావంతో పలువురు యువకులు బెట్టింగ్‌లో డబ్బులు పెట్టి మోసపోవడంతోపాటు కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు రూ.వేల కోట్ల డబ్బు కొల్లగొట్టినట్లుగా ఆరోపణలున్నాయి. ఇదే కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి మరోవైపు ఈడీ కూడా దర్యాప్తు చేసున్న సంగతి తెలిసిందే.
