Renuka Swamy Case | కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నది. హత్య కేసులో పోలీసులు పక్కాగా సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. అదే సమయంలో ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదలకుండా విచారిస్తున్నారు. దొరికిన ప్రతీ ఒక్క వస్తువునీ సాక్ష్యంగా మలుస్తున్నారు. తాజాగా రేణుకస్వామి హత్య కేసులో నిందితుల వేలిముద్రలకు సంబంధించిన కీలక రిపోర్ట్ పోలీసుల చేతికి అందింది. రేణుకాస్వామిని హత్య చేసిన ప్రాంతం, మృతదేహాన్ని తరలించిన వాహనంలోని వేలిముద్రలు హీరో దర్శన్ తూగుదీప, హీరోయిన్ పవిత్ర గౌడ వేలిముద్రలతో సరిపోలాయి. అలాగే జైలులో ఉన్న మరో పదిమంది వేలిముద్రలతోనూ మ్యాచ్ అయ్యాయి. హత్య జరిగిన చోట లభ్యమైన వేలిముద్రలను సేకరించిన పోలీసులు వాటిని హైదరాబాద్, బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కు అధికారులు పంపారు. అయితే, రెండు చోట్ల ఒకే రిపోర్ట్ వచ్చింది.
ఇంకా డీఎన్‌ఏ రిపోర్ట్ రావాల్సి ఉన్నది. ఇక రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన 17 మందిపై గతంలోనూ పోలీసు కేసులు నమోదయ్యాయి. ఇందులో కొందరిపై హత్య కేసులున్నాయి. ఈ నేపథ్యంలో కామాక్షిపాళ్య పోలీసులు తాజాగా బ్లూప్రింట్ రెడీ చేసిన ఇవ్వాలని పీడబ్ల్యూడీ అధికారులకు లేక రాశారు. కామాక్షిపాళ్యలోని పట్టణగెరె మెకానిక్ షెడ్డు నుంచి రేణుకాస్వామి శవాన్ని ఏ మార్గాన తరలించారు..? ఎక్కడ పడేశాడు..? ఆ తర్వాత ఏ మార్గంలో ఎవరు ఎటు వెళ్లారు? అనే పూర్తి సమాచారం ఆధారంగా బ్లూ ప్రింట్ ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా.. రేణుకాస్వామి హత్య కేసులో సినీ నటుడు దర్శన్ తూగుదీప, పవిత్ర గౌడతో పాటు 15 మంది నిందితులను జ్యుడీషియల్ కస్టడీని బెంగళూరు కోర్టు పొడిగించింది. నిందితుల జ్యుడీషియల్ కస్టడీని ముగియగా పోలీసులు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరుచగా.. జూలై 18 వరకు పొడిగించింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి ప్రసన్న కుమార్ రిమాండ్ కాపీని సమర్పించి నిందితుడి జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు మేజిస్ట్రేట్ ముందు పొడిగించాలని కోరారు. ఈ మేరకు జడ్జి ఆదేశాలను జారీ చేశారు.