Site icon vidhaatha

Bala Krishna|ఏంటి.. బాల‌కృష్ణ‌కి ఆస్తుల‌తో పాటు భారీగా అప్పులు కూడా ఉన్నాయా..!

Bala Krishna| నంద‌మూరి బాల‌కృష్ణ‌… ఈ పేరు చెబితే తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌లు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. ఆయ‌న డైలాగులు, ఫైట్స్ చూస్తే ప్రేక్ష‌కులు పిచ్చెక్కిపోవ‌డం ఖాయం.బాల‌య్య ఇప్ప‌టికీ కూడా సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూనే ఉన్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం బాబీ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 109వ సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఎల‌క్ష‌న్స్ సీజ‌న్ వ‌ల్ల‌న సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి రాజ‌కీయాల‌పై పూర్తి దృష్టి పెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈ క్ర‌మంలో ప్రముఖ సినీనటుడు, హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మ‌రోసారి హిందూపురంలో నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అక్కడ రెండు సార్లు గెలిచిన బాల‌య్య‌ మరోసారి అక్క‌డే గెలిచి హ్యాట్రిక్ సాధించాల‌నే క‌సితో ఉన్నారు.

బాల‌య్య ప్ర‌స్తుతం హిందూపురంతోపాటు రాయలసీమ జిల్లాల్లో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ అంద‌రిలో జోష్ నింపుతున్నారు. శుక్రవారం తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు బాల‌య్య‌.అయితే బాల‌య్య త‌న నామినేష‌న్ ప‌త్రాల‌లో ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తనకు రూ. 9 కోట్లకుపైగా అప్పులున్నాయని అఫిడ‌విట్‌లో బాల‌య్య పేర్కొన్న‌ట్టు తెలుస్తుంది. తన పేరిట రూ.81.63 కోట్ల ఆస్తులు ఉన్నాయని , తన భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140.38 కోట్లు అని, కుమారుడు మోక్షజ్ఞ పేరిట రూ.58.63 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇక అందులో తనకు రూ.9.9 కోట్లు, తన భార్యకు రూ.3.83 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నామని ఆయ‌న చెప్పుకొచ్చారు. తాను వచ్చాక హిందూపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన‌ట్టు తెలియ‌జేశారు. తాగునీటి సమస్య తీర్చడంతోపాటు మండలాలు, గ్రామాల్లో సీసీ రోడ్లు, కల్వర్టులను నిర్మించినట్లు కూడా తెలియ‌జేశారు. అన్నక్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించినా.. హిందూపురంలో 400 మందికి భోజనాలు ఏర్పాటు చేసినట్లు బాల‌య్య ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు. తనను రెండుసార్లు గెలిపించిన హిందూపురం ప్రజలను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని బాలకృష్ణ కోరారు.

Exit mobile version