Telugu Film Chamber | విధాత, హైదరాబాద్ : తెలుగు ఫిలీం ఛాంబర్ లో మంగళవారం ఘర్షణ తలెత్తింది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలుగా విడిపోయి ఇరువర్గాల వారు కొట్టుకున్నారు. పైడి జయరాజ్ ఫొటో చిన్నదిగా పెట్టారని, సి.నారాయణరెడ్డి, దాశరధి ఫోటోలు ఎందుకు లేదని పాశం యాదగిరి సహా పలువురు తెలంగాణ వాదులు వివాదానికి దిగారు. నిర్మాతల మండలి ఛాంబర్ లోకి చొచ్చుకెళ్లే యత్నం చేశారు. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్నకుమార్ తో పాశం యాదగిరి వాగ్వాదానికి దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను అదుపు చేసి పరిస్థితిని సద్దుమణిగించారు.
తెలుగు చలన చిత్ర మండలిలో ఆంధ్రావాళ్ల ఆధిపత్యం పెరిగిపోయిందని..తెలంగాణ వారిని చిన్నచూపు చూస్తున్నారని పాశం యాదగిరి ఆరోపించారు. ఇక్కడ అంతా చంద్రబాబు తొత్తులు ఉన్నారని..ప్రాంతేతరులు అన్యాయం చేస్తే ప్రాంతం ఆవలకు తరిమికొడుతామని హెచ్చరించారు. తెలంగాణ ప్రముఖుల ఫోటోలు చిన్నగా ఉండటంపై ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం చెప్పారన్నారు. ఓ హోరోయిన్ ఫోటో కింద పైడిజయరాజ్ ఫోటో పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగితే వాగ్వివాదాని దిగారని..పోలీసులకు ఫిర్యాదు చేశారని పాశం మండిపడ్డారు. డీసీపీని, సీఐనే ఇక్కడికి రమ్మంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తెలుగు చలన చిత్ర మండలి కుల తత్వం, ప్రాంతీయ తత్వంలో సినిమాలు తీయాలన్నారు. తెలంగాణ ప్రాంతం వారిని అన్ని రకాలుగా అవమానిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ జీవన చిత్రాలు రావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ చరిత్రకారులు, యోధుల సినిమాలు వీళ్లు ఎందుకు తీయరని మండిపడ్డారు.
