Deepika Padukone : స్పిరిట్..కల్కీ సిక్వెల్ నుంచి తప్పుకోవడంపై దీపికా పదుకొణె వైరల్ కామెంట్స్

'స్పిరిట్', 'కల్కీ' సిక్వెల్ నుంచి తప్పుకోవడంపై దీపికా పదుకొణె స్పందించారు. 8 గంటల పని విధానంపై ఆత్మాభిమానంతో పోరాటం చేస్తున్నానని, చాలామంది సూపర్‌స్టార్‌లు కూడా ఇంతే పనిచేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Deepika Padukone

విధాత : స్పిరిట్..కల్కీ 2898 ఏడీ సిక్వెల్ సినిమాల నుంచి తప్పుకోవడంపై దీపికా పదుకొణె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు సినిమాల నుంచి ఎందుకు తప్పుకున్నారన్నదానిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపిక స్పందించారు. ఒక ఆత్మాభిమానం ఉన్న నటిగా నన్ను ఇబ్బందిపెట్టే వాటిని అంగీకరించబోనన్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చాలామంది సూపర్‌స్టార్‌లు, అగ్ర హీరోలు ఎన్నోఏళ్లుగా 8 గంటలు మాత్రమే పని చేస్తున్నారు. ఇదేం రహస్యం కాదు. కానీ ఇన్నేళ్లలో ఈ విషయం ఎప్పుడూ వార్తల్లో నిలవలేదని గుర్తు చేశారు. ఇప్పుడు వాళ్ల పేర్లు చెబితే మొత్తం విషయం తప్పుదోవ పడుతుందని.. అందుకే వాళ్ల పేర్లు చెప్పాలనుకోవడం లేదన్నారు. కానీ, చాలామంది హీరోలు 8 గంటలే పని చేస్తారని అందరికీ తెలిసిన విషయమేనని దీపిక చెప్పుకొచ్చారు. అంతేకాదు.. వారిలో చాలామంది సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే షూటింగ్‌లలో పాల్గొంటారు. వారాంతాల్లో పని చేయరు అని తెలిపారు. ఇప్పుడు చాలామంది మహిళలు, తల్లుగా మారిన వారు కూడా అదే విధంగా పని చేస్తున్నారు. కానీ ఇది వార్తల్లోకి రావడం లేదు అని పేర్కొన్నారు.

గౌరవంగానే నా పోరాటం

పనిగంటలపై న్యాయంగా పోరాటం చేస్తున్న కారణంగా మీరు ఇబ్బందిపడ్డారా అని అడిగిన ప్రశ్నకు దీపిక ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. నేను దీన్ని చాలాసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నానని..ఇది కొత్తేం కాదు. దీన్ని ఎలా వెల్లడించాలో కూడా నాకు తెలియడం లేదు అన్నారు. అయితే ఎన్నో పోరాటాలను నిశ్శబ్దంగా ఎదుర్కొన్నాను. కానీ, కొన్ని కారణాల వల్ల అవి బహిరంగంగా మారుతాయన్నారు. జీతం విషయంలోనూ నన్ను తగ్గించే పరిస్థితులు వచ్చాయి. కానీ నేను ఎప్పుడూ అలా వెళ్లిపోలేదు అని.. శాంతిగా, గౌరవంగా నా పోరాటం చేశాను అని తెలిపారు. నేనెప్పుడూ దేనిపైనా స్పందించను. నిశ్శబ్దంగా యుద్ధాలను చేయడం మాత్రమే నాకు తెలుసు. అలా చేస్తేనే అది గౌరవంగా, హుందాగా ఉంటుంది’’ అని దీపిక అభిప్రాయపడ్డారు. పని గంటలపైన, పని పద్ధతులపైన దీపిక వెల్లడించిన అభిప్రాయాలు పరిశ్రమలో ఒక చర్చకు దారి తీసేలా ఉన్నాయంటున్నారు.

ఆ రెండు ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడంతోనే రచ్చ

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇటీవల రెండు పెద్ద ప్రాజెక్టులు స్పిరిట్..కల్కీ సిక్వెల్ నుంచి తప్పుకోవడం సినిమా వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. సందీప్ వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పీరిట్ తో పాటు తను ఇదివరకే నటించగా..ఘన విజయం సాధించిన కల్కీ 2898 ఏడీ సీక్వెల్‌ నుంచి ఆమె తప్పుకోవడం గురించి ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. స్పీరిట్ సినిమాలో మొదట దీపికా ఎంపికయ్యారు. అయితే పని వేళలపై ఆమెకు ఉన్న అభిప్రాయాల వల్ల ఆమె స్థానంలో త్రిప్తి దిమ్రికి అవకాశం కల్పించారు. ఇదే కారణంతో పాటు డేట్స్ సమస్యతో కల్కీ సిక్వెల్ నుంచి కూడా దీపికను తప్పించారు. ప్రస్తుతం దీపికా, షారుక్ ఖాన్‌తో కలిసి కింగ్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.