Deepika Padukone | వైజయంతి మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కల్కి 2898 AD సీక్వెల్ లో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్(Deepika Padukone) ఇక భాగం కాదని అధికారికంగా ప్రకటించింది. రెండు నెలల క్రితం నుంచే ఈ వార్త ఊహాగానాలుగా వినిపించినప్పటికీ, గురువారం నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా స్పష్టతనిచ్చింది.
వైజయంతి మూవీస్ తన అధికారిక X (Twitter) ఖాతాలోప్రకటించిన దాని ప్రకారం: “@deepikapadukone రాబోయే #Kalki2898AD సీక్వెల్‌లో భాగం కాదని అధికారికంగా ప్రకటిస్తున్నాం. పరిస్థితిని నిశితంగా పరిశీలించిన తరువాత మేము వేర్వేరు దారుల్లో పయనించాలని నిర్ణయించుకున్నాం. మొదటి భాగం నిర్మాణంలో ఆమెతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ, ఈసారి సరైన అవగాహన ఏర్పడలేదు. కల్కి లాంటి సినిమాకు సంపూర్ణ నిబద్ధత కావాలి. ఆమె భవిష్యత్ ప్రాజెక్టులకు మా శుభాకాంక్షలు” అని పేర్కొంది.
This is to officially announce that @deepikapadukone will not be a part of the upcoming sequel of #Kalki2898AD.
After careful consideration, We have decided to part ways. Despite the long journey of making the first film, we were unable to find a partnership.
And a film like…
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 18, 2025
ఈ ప్రకటన వెలువడిన వెంటనే, దీపికా పదుకోన్ చేసిన డిమాండ్స్ వల్లే తనను తప్పించడం జరిగిందని ఫిలింనగర్‌లో చర్చ మొదలైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆమె తన పారితోషికాన్ని మొదటి భాగం కన్నా 25 శాతం పెంచాలని కోరిందట. అదేవిధంగా రోజుకు కేవలం 7 గంటలపాటు మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటానని షరతు పెట్టిందని చెబుతున్నారు. నిర్మాతలు ఎక్కువ గంటలు పనిచేయాలని సూచించినా, విశ్రాంతి కోసం విలాసవంతమైన వానిటీ వాన్ ఇచ్చేందుకు ముందుకొచ్చినా, ఆమె అంగీకరించలేదట. అంతేకాకుండా, తన 25 మంది సిబ్బందికి 5-స్టార్ వసతి కల్పించాలన్న షరతు కూడా పెట్టిందని టాక్. ఈ అదనపు ఖర్చులు నిర్మాణ సంస్థకు భారమవుతాయని భావించి, వారు వెనక్కి తగ్గారని సమాచారం.
దీపికకు ఇది మొదటిసారి కాదు. మే నెలలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘స్పిరిట్’ చిత్రం నుంచి కూడా దీపికను వదులుకున్నారు. అప్పుడు కూడా రూ.20 కోట్ల పారితోషికం, లాభాలలో వాటా, తెలుగులో డైలాగులు చెప్పనని షరతులు, అలాగే మాతృత్వం తరువాత కేవలం 8 గంటల షిఫ్ట్ మాత్రమే పనిచేస్తానని డిమాండ్లు ముందుంచడంతో వంగా అసహనం వ్యక్తం చేశారని బీ టౌన్‌లో టాక్. ఆయన అప్పట్లో ఎవరిపేరూ ప్రస్తావించకుండా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు కానీ అది దీపికపైనే అని అందరికీ తెలుసు. పైగా ‘స్పిరిట్(Spirit)’ కథను ఇంకొకరికి లీక్ చేసిందని కూడా సందీప్ ఆరోపించారు.
When I narrate a story to an actor, I place 100% faith. There is an unsaid NDA(Non Disclosure Agreement) between us. But by doing this, You’ve ‘DISCLOSED’ the person that you are….
Putting down a Younger actor and ousting my story? Is this what your feminism stands for ? As a…— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 26, 2025
ఇక ఇప్పుడు కల్కి 2898 AD సీక్వెల్ విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురుకావడంతో నిర్మాణ సంస్థ అధికారికంగా దీపికను వదిలేసిన విషయాన్ని ధృవీకరించింది. దీపిక స్థానం ఎవరు భర్తీ చేస్తారు అన్నదానిపై ఇప్పుడు సినీ జనాల్లో, ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. గతంలో ‘ఆనిమల్(Animal)’ సినిమాలో నటించిన త్రిప్తి డిమ్రి(Tripti Dimri)ని స్పిరిట్‌కు తీసుకున్నట్లు తెలిసిందే. ఈసారి నాగ్అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి రెండో భాగంలో ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. అన్నట్లు ఈ రెండు సినిమాల్లోనూ రెబల్‌స్టార్ ప్రభాసే(Prabhas) హీరో కావడం గమనార్హం.
ప్రస్తుతం దీపికా పదుకోన్ 2024లో విడుదలైన సింగం అగైన్ (Singham Again)తర్వాత కొత్తగా హిందీ ప్రాజెక్టులను సైన్ చేయలేదు కానీ, అల్లు అర్జున్ హీరోగా, ఆట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ తెలుగులో నిర్మిస్తున్న భారీ పాన్ఇండియా చిత్రం(AA22xA6)లో కథానాయికగా ఓకే చెప్పింది. ఆమె ఎంట్రీ గురించి చిత్రబృందం ఒక చిన్న మేకింగ్ వీడియో కూడా విడుదల చేసింది. ఇది కూడా ఉంటుందా? లేదా? అనేది ఇప్పుడు సగటు తెలుగు ప్రేక్షకుడి సందేహం.
ఇటీవల తన కూతురు దువా తొలి పుట్టినరోజు జరుపుకున్న ఆమె, మాతృత్వానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. “డైరెక్టర్ ఒకరు మీటింగ్‌కి రావాలని చెప్పగా, నేను నా బిడ్డతో ఇంట్లో ఉండాల్సి ఉందని చెప్పాను. దానికి ఆయన ‘మాతృత్వాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు’ అని అన్నాడు. అది ప్రశంసా లేక వ్యంగ్యమో తెలియదు. కానీ అవును, మాతృత్వమే నాకు ప్రాధాన్యం” అని స్పష్టంగా తెలిపింది. అది సందీప్ గురించేనని జనాలకు తెలుసు.
అయితే, నిర్మాణ సంస్థలు, దర్శకుల అభిప్రాయం ప్రకారం, దీపికా పదుకోన్ సినిమాను ఒక డబ్బు సంపాదించే ప్రాజెక్టుగానే చూస్తోంది తప్ప, ఎటువంటి నిబద్ధత, ఆసక్తి కనబరచడంలేదు. హిందీ సినిమాలలో ఇవన్నీ ఏమీ లేకుండానే ఒప్పుకునే తను, దక్షిణాదికి వచ్చేసరికి గొంతెమ్మ కోరికలు కోరుతోందని, అసలు హిందీ వాళ్లు ఎలా చెబితే అలా, ఎంతిస్తే అంత అన్నట్లు ఉండే దీపిక దక్షిణాది అమ్మాయి అయివుండి కూడా ఇంత అహంకారపూరితంగా ప్రవర్తించడం బాగాలేదని ఒక హిందీ చిత్ర పాత్రికేయుడు అసహనం వ్యక్తం చేసారు.