Devara| జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ దేవర. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీగా అంచనాలున్నాయి. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రెండు పార్ట్‌లుగా రూపొందిస్తున్నారు. తొలిపార్ట్‌ని అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నారు. మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ కథానాయికగా నటిస్తుండగా, మిగతా పాత్రలలో సీనియర్ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు.అయితే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కాగా ఎలాంటి సర్‌ప్రైజ్ వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.
కొద్ది సేపటి క్రితం దేవర మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘ఫియర్’ సాంగ్ అంటూ సాగే ఈ పాటకి అనిరుధ్ రవిచంద్ర మ్యూజిక్‌ను ఇరగదీశారు. ఈ పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి, హిందీలో మనోజ్ ముంతాషిర్, తమిళంలో విష్ణు ఏడవన్, కన్నడలో ఆజాద్ వరదరాజ్, మలయాళంలో గోపాలకృష్ణ రాశారు. తెలుగులో అనిరుధ్‌కు డిమాండ్ ఉన్నా సరైన హిట్ ఇంకా పడలేదు. ఈ దేవర మూవీతో అనిరుధ్ ఖాతాలోనూ తెలుగు నుంచి భారీ హిట్ పడేలా ఉంది. ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ అయితే అదిరిపోయింది. ఇక రెండో పాటగా లవ్ సాంగ్‌ను వదిలేలా కనిపిస్తోంది. ఇందులో జాన్వీ సందడి కూడా కనిపించేలా కనిపిస్తుంది.