Kalki 2 Update : కల్కి 2 వచ్చేది అప్పుడే..నాగ్ అశ్విన్ క్లారిటీ!

నాగ్ అశ్విన్ వెల్లడించారా: కల్కి 2 షూటింగ్ ఈ ఏడాది చివర ప్రారంభం, ప్రభాస్, కమల్, అమితాబ్, దీపికా సన్నివేశాలతో 2028లో రిలీజ్.

విధాత, హైదరాబాద్ : ప్రభాస్‌(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అశ్వనీ దత్ నిర్మించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ పాన్ వరల్డ్ సినిమాగా సాధించిన విజయంతో సీక్వెల్ కల్కీ 2(Kalki 2) సినిమా రాక కోసం ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. పురాణ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ 2024, జూన్‌ 27న విడుదలైంది. అప్పటి నుంచి ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడన్నదానిపై చిత్ర బృందం నుంచి..నాగ్ అశ్విన్ నుంచి గాని స్పష్టత కొరవడింది. గతంలో నిర్మాత అశ్వనీదత్‌(Aswani Dutt) ఓ ఇంటర్వ్యూలో ‘కల్కి 2’ సినిమాపై మాట్లాడుతూ..రెండో పార్ట్‌ లో కమలహాసన్ కీలకమని..ప్రభాస్, కమలహాసన్(Kamal Haasan), అమితాబచ్చన్(Amitabh Bachchan), దీపికా పదుకొణె( Deepika Padukone) పాత్రాల మధ్య సన్నివేశాలు ప్రధానంగా ఉంటాయని చెప్పి సినిమాపై అంచనాలు పెంచారు.

తొలి పార్ట్ చిత్రీకరణ సమయంలోనే రెండో పార్ట్‌లోనూ కొంత భాగం షూటింగ్‌ పూర్తయింది. అయితే మిగతా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభిస్తారు.. రిలీజ్‌ ఎప్పుడు చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కల్కి 2(Kalki 2)పై దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) కీలక అప్డేట్ వెలువరించారు. కల్కి2 షూటింగ్‌ చాలా అంశాలతో ముడిపడి ఉన్న కథ కావడం..అందులో నటీనటులందరికీ కాంబినేషన్‌ సన్నివేశాలు ఉండటంతో వారందరి డేట్స్ కుదిరినప్పుడే చిత్రీకరణ సాగించాల్సి ఉందని నాగ్ అశ్విన్ తెలిపారు. ముఖ్యంగా విజువల్‌ వండర్‌ సీక్వెన్స్‌ ..యాక్షన్‌ సన్నివేశాలు కూడా భారీగా ఉంటాయని..వీటిని చిత్రీకరించడానికి చాలా సమయం పడుతుందన్నారు.

ప్రస్తుతం కల్కి తొలి పార్ట్ లో నటించిన స్టార్స్ అందరూ బిజీగా ఉన్నారన్నారు. ఈ ఏడాది చివర్లో కల్కి 2 షూటింగ్‌ ప్రారంభించాలని అనుకుంటున్నామని..అయితే రిలీజ్‌ ఎప్పుడన్నది తాను కచ్చితంగా చెప్పలేనన్నారు. షూటింగ్‌కు తక్కువ సమయం పట్టినప్పటికీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ఎక్కువ సమయం పడుతుందని.. మరో రెండు సంవత్సరాలలో పెద్ద స్క్రీన్‌పై ఈ సినిమాను చూడొచ్చన్నారు. అంటే 2028లోనే కల్కి వచ్చే అవకాశముంది. హీరో ప్రభాస్‌ ‘రాజాసాబ్‌(Raja Saab)’, ‘ఫౌజీ(Fauji)’ సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. దీనితో పాటు సందీప్‌ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’(Spirit) మూవీ షూటింగ్ అక్టోబర్‌ లో ప్రారంభం కానుంది. ఒకదాని తర్వాతా ఒకటిగా ఈ సినిమాలను పూర్తి చేశాకే ప్రభాస్ ‘కల్కి 2’లో జాయిన్‌ అవుతారని టాక్.