విధాత : దుల్కర్ సల్మాన్ , భాగ్యశ్రీ బోర్సే , సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కాంత’ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ‘ఊదిపడేయడానికి నేను మట్టిని కాదు.. పర్వతాన్ని..’ అంటూ హీరో దుల్కర్ చెప్పే డైలాగ్ లతో ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేదిగా కనిపించింది. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న మూవీ నవంబరు 14న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇప్పుడు తెలుగు, తమిళ ట్రైలర్స్ ఒకేసారి రిలీజ్ చేశారు.
తన కెరీర్‌ను తీర్చిదిద్దిన గురువుకి, ఆ నటుడికి మధ్య జరిగే పోరాటమే కాంతా సినిమా కథగా వస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ లో సినీ పరిశ్రమకు సంబంధించి తెర ముందు, వెనుక జరిగే సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచిదిగా ఉన్నాయి. 1950ల నాటి మద్రాస్ సినీ పరిశ్రమ చుట్టూ తిరితే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ‘కాంత’ తెరకెక్కించారని..ఆనాటి ప్రముఖ నటుడు ఎం.కె. త్యాగరాజ భాగవతార్ ఒక హత్య కేసులో ఇరుక్కున్న అంశాల నుండి దుల్కర్ సల్మాన్ పాత్ర ప్రేరణ పొందినట్టు ఫిల్మ్ సర్కిల్ కథనం. ఈ సినిమాలో దగ్గుబాటి రానా కూడా ఓ పాత్రలో నటిస్తున్నారు. ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్‌లతో రానా, దుల్కర్ సల్మాన్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.
