సత్యం చెప్పిన ‘పుష్ప’ విలన్​

బన్వర్​సింగ్​ షెకావత్​‌‌ – ఈ పేరు తెలుగు సినీప్రియులు అంత తేలిగ్గా మర్చిపోరు. ఎలా మర్చిపోతారు? పుష్పరాజ్​ను అంతేస్థాయిలో ఢీకొట్టిన పోలీసాఫీసర్​ మరి. అతనే ఫహద్​ ఫాజిల్​. ఫఫా అని ముద్దుగా పిల్చుకుంటారు. అద్భుతమైన మళయాళ నటుడు.

  • Publish Date - April 25, 2024 / 06:43 PM IST

పహద్ ఫాజిల్ పేరుకి మళయాళీ అయినా, తెలుగు, తమిళ సినిమాలు కూడా చాలా చేసాడు. తెలుగు హీరో నాని సినిమా అంటే సుందరానికి సినిమాలో హీరోయిన్గా నటించిన నజ్రియా నజీమ్ ఫఫా భార్యే. ఫహద్ చాలా మంచి మనిషి. ఎవరనీ నొప్పించకుండా ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. అటువంటిది ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం లేపాయి.

ఒకానొక ఇంటర్వ్యూలో సినిమా గురించి తన అభిప్రాయం చెబుతూ, ప్రేక్షకులు సినిమాను సినిమాలాగే చూడాలి. ఈ రెండున్నర గంటలు ఎంజాయ్ చేయాలి. కావాల్సిస్తే సినిమా నుంచి ఇంటికి వచ్చే దారిలో కూడా దాని గురించి మాట్లాడుకోవచ్చు. కానీ, ఇంటికి వచ్చిన తర్వాత దాని టాపిక్ అనవసరం. మనకు ఇంకో జీవితం ఉంటుంది. దాన్లోకి వెళ్లిపోవాలి. సినిమా గురించే చర్చిస్తూ ఇంట్లో కూడా టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. సినిమాకు కూడా ఓ పరిధి ఉంటుంది. డైనింగ్ టేబుల్ దాకా సినిమాను తీసుకురాకండి అని సలహా ఇచ్చాడు. అది కాస్తా కాంట్రావర్సీ అయి కూర్చుంది. దాంతో కొంతమంది దురభిమానులు ఆయన మీద విరుచుకుపడుతుంటే, ఆయనన్నది నిజమే కదా మరికొంతమంది సపోర్ట్ చేస్తున్నారు.

ఎంత అభిమానులైనా, అభిమానం గుండెల్లో ఉండాలి కానీ, ఫ్లెక్సీలు, పాలాభిషేకాలు, డిజేలు.. ఏంటిదంతా.. నాన్సెన్స్ కదా అని చాలామంది అభిప్రాయం. సినీహీరోలు కూడా అభిమానులను చూసి ఉప్పొంగిపోతారు. అంతవరకే. ఇంట్లో ఎవరి జీవితం వారిది. వారు బతుకుదెరువు కోసం నటిస్తున్నారు. షూటింగ్ అయిపోయాక, వారి ఇల్లూపిల్లలూ, వ్యవహారం..అంతే. మనం కూడా అంతే ఉండాలి గానీ, సోషల్ మీడియాలో హీరోల ఫ్యాన్స్ దుమ్మెత్తిపోసుకోవడం, థియేటర్ల వద్ద తన్నుకోవడం ఎందుకు? సినిమాలే కాకుండా అందరికీ జీవితం ఒకటి ఉంటుంది కదా. ఇదే ఫఫా కూడా చెప్పింది. సత్యమే కదా.

Latest News