Payal Kapadia | కేన్స్ వేదిక‌పై చ‌రిత్ర సృష్టించిన పాయ‌ల్ క‌పాడియా

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భార‌తీయ మహిళలు సత్తాచాటారు. మలయాళీ చిత్రం ‘ఆల్‌ వీ ఇమాజైన్‌ యాజ్‌ లైట్‌’ కుగాను భారతీయ ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియా ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకుంది.

  • Publish Date - May 26, 2024 / 08:58 PM IST

ఫ్రాన్స్ వేదిక‌గా జ‌రిగ‌న ప్రతిష్ఠాత్మక 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భార‌తీయ మహిళలు సత్తాచాటారు. మలయాళీ చిత్రం ‘ఆల్‌ వీ ఇమాజైన్‌ యాజ్‌ లైట్‌’ కుగాను భారతీయ ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియా ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకుంది. తొలి భారత ఫిల్మ్ మేకర్‌గా పాయల్ కపాడియా చ‌రిత్ర సృష్టించ‌గా, భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా ఉత్త‌మ న‌టిగా అవార్డు అందుకుని కేన్స్‌లో ఈ అవార్డు గెలిచిన తొలి భారతీయురాలిగా అరుదైన ఘనత సాధించింది.
శ‌నివారం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన ఈ వేడుక‌లో తనకు అవార్డు తెచ్చిన పెట్టిన చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన కానీ కస్తూరి, దివ్యప్రభ, చాయా కదమ్‍ను పాయల్ కపాడియా కౌగిలించుకుని ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారు. కేన్స్ పోటీలో 30 ఏళ్ల తర్వాత ప్రదర్శితమైన భారతీయ చిత్రంగానూ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్‌ లైట్’ నిలవ‌డం మ‌రో విశేషంగా చెప్పొచ్చు. పాయ‌ల్ చిత్రానికి ముందు ఈ ఈవెంట్ ప్రధానమైన పోటీలో ప్రదర్శితమైన భారతీయ మూవీగా ”స్వహమ్” (1994) ఉంది. కేన్స్‌లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డు గెలిచి చరిత్ర సృష్టించిన పాయల్ కపాడియాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీలు వేరువేరుగా వారి ఎక్స్ ఖాతాల్లో ప్రశంసించారు. కొత్త తరం ఫిల్మ్ మేకర్లకు స్ఫూర్తిగా నిలిచారంటూ కపాడియాను మోదీ అభినందించారు. భారత్‍ గర్విస్తోందంటూ ట్వీట్ చేశారు. ”ప్రతిష్టాత్మక కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకున్నందుకు పాయల్ కపాడియాకు అలాగే ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ టీమ్ మొత్తానికి అభినందనలు. ‘ది షేమ్‌లెస్‌ అనే చిత్రంలో న‌ట‌న‌కు గాను ‘అన్‌ సర్టెయిన్‌ రిగార్డ్‌’ కేటగిరీలో ఉత్త‌మ న‌టిగా అవార్డు గెలుచుకున్న అనసూయ సేన్‌గుప్తాకు అభినందనలు. ఈ మహిళలు చరిత్ర లిఖించి మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమకి ఆదర్శంగా నిలుస్తున్నారు”. అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Latest News