Tollywood Christmas Releases | ఒకే రోజు బరిలోకి నాలుగు సినిమాలు..సక్సెస్ ఎవరిదో!

డిసెంబర్ 25న ఒకే రోజు నాలుగు తెలుగు సినిమాలు విడుదల కానున్నాయి. రోషన్ 'చాంపియన్', విశ్వక్ సేన్ 'ఫంకీ', అడవి శేష్ 'డకాయిట్', ఆది సాయికుమార్ 'శంబాల' చిత్రాలు క్రిస్మస్ బరిలో పోరాడనున్నాయి.

విధాత, హైదరాబాద్ : టాలీవుడ్ లో ఒకే రోజు నాలుగు తెలుగు సినిమాలు విడుదల కానుండటం ఆసక్తికరంగా మారింది. ఆ సినిమాల మధ్య పోరులో చివరికి విజయం ఎవరిదన్నదానిపై ప్రేక్షక వర్గాలలో చర్చ సాగుతుంది. డిసెంబర్ 25న క్మిస్మస్ సందర్బంగా ఆ నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ మేకా నటించిన ‘చాంపియన్’ మూవీ అదే రోజు విడుదలవుతుంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, గ్లింప్స్ హైప్ క్రియేట్ చేశాయి. నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందడి లాంటి మూవీస్ చేసిన రోషన్ కు ఇంకా సరైన బ్రేక్ రాలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని ‘ఛాంపియన్’ మూవీ చేస్తున్నాడు. 90వ దశకం బ్యాక్ డ్రాప్ లో ఫుట్ బాల్ గేమ్ డ్రామాతో నడిచే కథతో వస్తున్న ఈ మూవీని స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిం బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తుండగా స్వప్న దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇక విశ్వక్ సేన్ హీరోగా “జాతిరత్నాలు” ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫంకీ మూవీ డిసెంబర్ 25 బరిలోకి రాబోతున్న మరో చిత్రం. గత సినిమా ‘లైలా’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడంతో కామెడీ, వినోదం, విశ్వక్ ఎనర్జీ అన్నీ కలిసి ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కయాదు లోహార్ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. టీజర్‌తో మంచి బజ్ తెచ్చుకున్న ఫంకీ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

వాటితో పాటు అదే రోజు వచ్చే మరో సినిమా ఆడవి శేష్ నటించిన ‘డకాయిట్’. ఒక ప్రేమ క‌థ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్‌గా చేసిన ఈ మూవీకి షానీల్ డియో దర్శకత్వం వహించగా… అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ సంస్థలపై కింగ్ నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇద్దరు మాజీ ప్రేమికుల కథే ‘డకాయిట్‌గా రాబోతుంది. అనురాగ్ క‌శ్య‌ప్ కీల‌క పాత్రలో న‌టిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.

డిసెంబర్ 25న మరో యంగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న ‘శంబాల’ సినిమాను సైతం తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’. ఎ మిస్టికల్ వరల్డ్ అనేది దీని ట్యాగ్ లైన్. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. అంతరిక్షం నుంచి ఏదో ఒక అతీంద్రయ శక్తి ఉన్న ఉల్క గ్రామంలో పడటంతో ఎదురైన పరిణామాల కథనంతో థ్రిల్లర్ మూవీగా రాబోతుంది. ఆ నాలుగు సినిమాలతో పాటు ‘అనకొండ : రిటర్న్స్’ అనే ఆంగ్ల చిత్రమూ అదే రోజు రాబోతోంది. మరి ఈ సినిమాలలో ఏది సక్సెస్ టాక్ అందుకుంటున్నది వేచిచూడాల్సి ఉంది.