Devi Sri Prasad To Debut As Hero In Venu’s “Yellamma” | Keerthy Suresh As Heroine | Dil Raju Production
హైదరాబాద్:
‘బలగం’ సినిమాతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’ కోసం ఎంత తాపత్రయపడుతున్నా, కథానాయకులు దొరకడంలేదు. ఎప్పటికప్పుడు కొత్త సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నా, అది సర్‌ప్రైజ్‌గానే మిగిలిపోతోంది. ఇప్పడు ప్రముఖ సంగీత దర్శకుడిని హీరోగా అనుకుంటున్నారట. అది కూడా ఉంటుందా? లేదా? అనేది వేణు చెప్పాల్సిందే.
మొదట ఈ సినిమాలో హీరోగా నేచురల్ స్టార్ నాని పేరు వినిపించింది. ఆ తర్వాత నితిన్, సాయి ధరమ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈమధ్య వచ్చిన తాజా సమాచారం ప్రకారం — ఈ సినిమాలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ను హీరోగా ఎంపిక చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. తన మ్యాజిక్‌తో తెలుగు సినిమాకు ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన దేవీశ్రీ ప్రసాద్, చాలా కాలంగా హీరోగా నటించాలని అనుకుంటున్నారని ఫిల్మ్ నగర వర్గాలు చెబుతున్నాయి. గతంలో రెండు మూడు ప్రాజెక్ట్‌లు కూడా ఆయన వద్దకు వచ్చినా, నచ్చక ఆగిపోయాయని సమాచారం. ‘ఎల్లమ్మ’ కథ తెలంగాణ నేపథ్యంతో సాగుతుందని, ఇది భావోద్వేగం, కుటుంబ బంధాల మేళవింపుతో కూడిన డ్రామా అని తెలిసింది. దర్శకుడు వేణు ఈ కథను ఎంతో శ్రద్ధగా రాశారట. ‘బలగం’ తరహాలోనే ప్రేక్షకుల హృదయాలను తాకే కథతో వస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
‘ఎల్లమ్మ’ హీరోయిన్‌గా కీర్తి సురేశ్.?
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్ ఎంపికైనట్లు సమాచారం. మొదటి నుంచీ కీర్తి పేరే వినిపించిందని, ఇప్పుడు ఆ వార్త మరింత బలపడుతోందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కీర్తి సురేశ్ విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నప్పటికీ, ‘ఎల్లమ్మ’లో కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ‘ఎల్లమ్మ’ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించనున్నారు. వేణు ‘బలగం’ విజయానంతరం అనేక నిర్మాతల నుంచి ఆఫర్లు వచ్చినా, తనకు బ్రేక్ ఇచ్చిన దిల్ రాజుతోనే తదుపరి ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్నాయని, నటీనటుల విషయమై అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం. హీరోగా దేవీశ్రీ ప్రసాద్ అనే వార్తపై అభిమానుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఒకవైపు ఆయన నటన ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే, మరోవైపు ఇది నిజమేనా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు చిత్ర బృందం ఈ వార్తపై అధికారికంగా స్పందించలేదు. హీరోల పేర్లు మారుతున్నా, హీరోయిన్‌గా కీర్తి పేరు మాత్రం ఫిక్స్‌డ్‌గా ఉండటంతో, ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉత్కంఠ మరింత పెరిగింది.
After the success of Balagam, director Venu Yeldandi is reportedly planning to cast Devi Sri Prasad as the lead actor in his next film “Yellamma”. Produced by Dil Raju, the film is said to star Keerthy Suresh as the heroine. While several hero names like Nani, Nithin, and Sai Dharam Tej were earlier considered, DSP’s name has now become the talk of Tollywood.