Jabardasth| మృత్యువు ఎప్పుడు ఎలా పలకరిస్తుందో ఎవరికి తెలియదు. ఊహించని విధంగా కొందరు అకాల మరణం చెందుతున్నారు. తాజాగా జబర్ధస్త్ నటుడు కదులుతున్న రైలు నుండి జారి అకాల మరణం చెందాడు. వివరాలలోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి.. రైలు, పట్టాల మధ్య ఇరుక్కుని ఓ టీవీ ఆర్టిస్టు కన్నుమూయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. చుంచుపల్లి మండలం నందాతండాకి చెందిన మహ్మద్దీన్.. భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఇంతలో కాకతీయ ఎక్స్‌ప్రెస్ స్టేషన్ నుంచి ముందుకు కదులుతోంది.
మహ్మద్దీన్.. ఆ రైలు ఎక్కాల్సి ఉండగా, అది అప్పటికే కదులుతుండటంతో.. రన్నింగ్‌లో ఆ రైలును ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రమాదవశాత్తూ కిందకు జారిపడటంతో రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయాడు. ఇది గమనించిన కొందరు ప్రయాణికులు చైన్ లాగడంతో లోకో పైలెట్ రైలును ఆపారు. ప్రమాదం గురించి తెలుసుకున్న రైల్వే పోలీసులు, సిబ్బంది.. మహ్మద్దీన్‌ను బయటకు తీసి.. వెంటనే కొత్తగూడెం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ మహ్మద్దీన్‌ను పరీక్షించిన వైద్యులు.. అతడి నడుము, పక్కటెముకలకు తీవ్రగాయాలు అయ్యాయని, అత్యవసర చికిత్స కోసం ఖమ్మం తరలించాలని చెప్పారు.
అయితే వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు మహ్మద్దీన్‌ను ఖమ్మం తరలిస్తుండగా, దురదృష్టవశాత్తు.. అతడు మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని సర్వజన ఆస్పత్రికి తరలించి, అక్కడ ఆస్పత్రిలో డ్యూటీ వైద్యురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న మహ్మద్దీన్ జబర్ధస్త్‌లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పని చేశాడు. దాదాపు 50 ఎపిసోడ్‌లలో ఆయన కనిపించి సందడి చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూ భార్యాబిడ్డలను పోషించుకుంటున్నాడు మహ్మద్దీన్. అయితే అతడి మృతితో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. అతని మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగింది.