Telangana Liquor Licenses Extension | ‘మద్యం’ లైసెన్స్‌ల గడువు పొడిగింపుపై వివాదం.. తెలంగాణ హైకోర్టుకు దరఖాస్తుదారులు!

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల దరఖాస్తు గడువును అక్టోబర్ 18 నుంచి 23 వరకు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ దరఖాస్తుదారులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. బీసీ బంద్ కారణంగా పొడిగించినట్లు ప్రభుత్వం చెబుతున్నా, ఇది నిబంధనలకు విరుద్ధమని, అక్రమాలకు తావిస్తుందని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు.

Telangana Liquor License Deadline Extension

హైదరాబాద్ : తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించడంపై తీవ్ర వివాదం చెలరేగింది. ఎక్సైజ్ శాఖ నిర్ణయం నియమాలకు విరుద్ధమంటూ దరఖాస్తుదారులు కోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. వాస్తవానికి, మద్యం దుకాణాల దరఖాస్తులు సమర్పించడానికి అక్టోబర్ 18 తుది గడువుగా ఉంది. అయితే, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల డిప్యూటీ కమిషనర్‌లు చేసిన విజ్ఞప్తి మేరకు గడువును అక్టోబర్ 23 వరకు పొడిగిస్తూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.

శనివారం జరిగిన బీసీ బంద్ కారణంగా ప్రజా రవాణా, బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడటం వల్ల అందరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కానీ, గడువు దరఖాస్తుదారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ను తుది నిమిషంలో మార్చడం అక్రమం, ఇది నిబంధనలకు విరుద్ధమని విమర్శిస్తున్నారు.

తొలి గడువులోగా దరఖాస్తు చేయడానికి ఎంతో సమయం, శ్రమ, డబ్బు ఖర్చు చేశామని, గడువు పొడిగింపు వల్ల చివరి నిమిషంలో వచ్చే వారికి అనవసరంగా అవకాశం కల్పించినట్లయిందని దరఖాస్తు దారులు ఆరోపిస్తున్నారు. గడువు పెంపు నిర్ణయం వెనుక రాజకీయ జోక్యం లేదా అవినీతికి ఆస్కారం ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు రుసుము ఈసారి రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచినా, దరఖాస్తుల సంఖ్య తగ్గడంతో ఆదాయాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వారు ఆరోపిస్తున్నారు.

ఏపీలో గతంలో ఎదురైన పరిస్థితి:

2019లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన బార్ లైసెన్స్‌ల గడువు పొడిగింపు వివాదాన్ని తెలంగాణ మద్యం దుకాణాల దరఖాస్తుదారులు గుర్తు చేస్తున్నారు. 2019లో దరఖాస్తుల గడువు పొడిగింపును సవాల్ చేస్తూ ఏపీలోని దరఖాస్తుదారులు కోర్టును ఆశ్రయించారు. ఆ కేసును విచారించిన కోర్టు 2020లో గడువు పొడిగింపు ఉత్తర్వులను రద్దు చేసింది. కాగా, ప్రస్తుత పొడిగింపును సవాల్ చేసేందుకు తెలంగాణ దరఖాస్తుదారులు ఈ కోర్టు తీర్పును ప్రధాన అస్త్రంగా ఉపయోగించాలని భావిస్తున్నారు. ఈ విషయంలో న్యాయపరమైన అన్ని అవకాశాలను పరిశీలిస్తామని వారు తెలిపారు. గతంలో 2,620 దుకాణాలకు గాను సుమారు 1.30 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి ఆదివారం నాటికి దాదాపు 89,000 దరఖాస్తులు దాఖలయ్యాయి. దరఖాస్తుల సంఖ్య తగ్గినా, ఫీజు పెంపు కారణంగా ప్రభుత్వ ఆదాయం పెరిగిందని అధికారులు చెబుతున్నారు.