Jr. NTR | విధాత : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘ఎస్క్వైర్ ఇండియా’ అనే ఒక మ్యాగజైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆ మ్యాగజైన్ కవర్ పేజీపై ఎన్టీఆర్ ఫోటో ప్రచురించడంతో ఆయన అభిమానులలో ఆనందం వ్యక్తమవుతోంది. ఎస్క్వైర్ ఇండియా కవర్ పేజ్ ఫోటో షూట్ ను దుబాయ్ లో నిర్వహించారు. అందుకు సంబందించిన వీడియోను కూడా ఎస్క్వైర్ ఇండియా త్వరలో రిలీజ్ చేయనుంది.
ఇకపోతే ఈ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారాయి. తన కుటుంబానికి సంబంధించిన సినిమాల లెగసీ విషయంలో ఏం జరుగుతుందో తనకు తెలియదని, తాను ఆ విషయంలో ఎలాంటి ప్లాన్స్ వేసుకోలేదని ఎన్టీఆర్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. అయితే తాను చెప్పే కథలతో తనను గుర్తుంచుకోవాలనే ప్రయత్నం మాత్రం చేస్తున్నానని అన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా తనను ఒక నటుడిగా కంటే ఎక్కువగా ఒక నిజాయితీగల మనిషిగా గుర్తించాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ఎమోషన్స్‌తో కూడిన నిజాయితీగల వ్యక్తిగా తనను గుర్తిస్తే చాలని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
తాజాగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న వార్ 2మూవీ ఈ నెల 14న విడుదల కానుంది. బాలీవుడ్ లో ఎన్టీఆర్ ఈ సినిమాతోనే ఎంట్రీ ఇస్తుండటంతో ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ ను పెంచుకున్న తారక్ సినిమాలకు ఓవర్సీస్ లోను భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో వార్ 2 కూడా భారీ విజయం సొంతం చేసుకోవచ్చని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధీమాగా వ్యక్తం చేస్తున్నారు.
