NTR|విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు (NTR)నటవారసులుగా ఇండస్ట్రీకి పలువురు హీరోలు వస్తూ తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మళ్లీ ఆ రేంజ్‌లో బాలయ్య అదరగొట్టారు. ఆ తర్వాత చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చిన కూడా జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఇప్పుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా.. హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు.ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న సమయంలో మరొక నందమూరి హీరో త్వరలో టాలీవుడ్ కి పరిచయం కానున్నట్టు ప్రకటించారు.నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామారావును దర్శకుడు వైవీఎస్ చౌదరి హీరోగా పరిచయం చేస్తున్నారు.
న్యూ టాలెంట్ రోల్స్ పతాకంపై తారక రామారావు హీరోగా వైవీఎస్ చౌదరి ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ను వైవీఎస్ చౌదరి(YVS Chowdary) మీడియాకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా బెస్ట్ విషెస్ చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. రామ్ సినీ ప్రపంచంలో నీ మొదటి దశకు ఆల్ ది బెస్ట్. సినిమా ప్రపంచం నిన్ను ఆదరించడానికి లెక్కలేనన్ని క్షణాలను అందజేస్తుంది. నీవు చేసే ప్రతి ప్రాజెక్టు విజయం సాధించాలి. నీకు అన్నింటా విజయమే దక్కాలని కోరుకుంటున్నా. ముత్తాత ఎన్టీఆర్, తాత హరికృష్ణ, నాన్న జానకిరామ్‌ల ప్రేమ, ఆశీస్సులు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నువ్వు కచ్చితంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటావన్న నమ్మకం నాకుంది. నీ భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోవాలి మై బాయ్ అంటూ తారక్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అరంగేట్ర ఎన్టీఆర్ ఫస్ట్ దర్శనం వీడియో బయటకి రాగా, అందులో
“నందమూరి తారక రామారావు అనే నేను..” అంటూ తన ప్రమాణాన్ని నాలుగో తరం ఎన్టీఆర్ మొదలుపెట్టారు. వైవీఎస్ చౌదరి వద్ద 18 నెలలుగా శిక్షణ పొందినట్టు తెలిపారు. ఆయన దర్శకత్వంలోనే భారతీయ చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నానని అన్నారు. “మన చలన చిత్ర పరిశ్రమ పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, దాని సమగ్రతను కాపాడతానని.. కథా రచయిత, దర్శక, నిర్మాతల సంతృప్తి మేరకు కథలు, సన్నివేశాలు, పాత్రలకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను రంజింపచేయడంలో నావంతు నిరంతర కృషి చేస్తానని నా ముత్తాత, నా దైవం విశ్వవిశ్వాత నటసౌర్యభౌమ, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను” అని ఎన్టీఆర్ చెప్పారు. ఏ.. తమ్మడూ విష్‍యూ ఆల్ గుడ్‍లక్ అని ఎన్టీఆర్‌ను వైవీఎస్ చౌదరి విష్ చేయడంతో ఈ వీడియో ముగిసింది.