Site icon vidhaatha

KALKI 2898 AD | క‌ల్కి 2898 ఏడిలో భార‌తీయ‌త లోపించిందా?

బాహుబలి ప్రభాస్(Prabhas)​, మహానటి దర్శకుడు నాగ్​ అశ్విన్​(Nag Ashwin), మెగా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్​(Vyjanthi Movies) కలయికలో వస్తున్న ఈ అతి భారీ చిత్రంపై పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ప్రత్యేకంగా నాగ్​ అశ్విన్ ఈ సినిమాను తన మానస పుత్రికగా అభివర్ణిస్తూ, ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఒకవేళ సినిమాను తెలుగు లేదా భారతీయ ప్రజలు ఆదరిస్తే, నాగ్​ అశ్విన్​ రాత్రికిరాత్రే అంతర్జాతీయ దర్శకుడవడం ఖాయం.

ఈపాటికే అందరూ కల్కి ట్రైలర్​, టీజర్లు చూసేఉంటారు. ఊహించడానికే నిర్మాతలు భయపడే అంతర్జాతీయస్థాయి భారత నటీనటులు అమితాబ్​ బచ్చన్​, కమల్​హాసన్​, ప్రభాస్​, దీపికాపడుకునే, దిశా పటానీ లాంటి వారు ఈ సినిమాలో భాగమయ్యారు.  ఇక విజువల్స్​ చూస్తే, అవెంజర్స్​ (Avengers) లాంటి మార్వెల్​ సినిమాలు, స్టార్​వార్స్(Star Wars) ​లు, స్టార్​ ట్రెక్​లు గుర్తుకువస్తున్నాయి.   వాటిలాగే ఇది కూడా భవిష్యత్కాల(Futuristic) కథా చిత్రం. అంటే క్రీస్తు శకం 2898లో జరిగిన కథ. అప్పటికి ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? ముఖ్యంగా భారతదేశం ఎలా ఉంటుంది? అనే ఊహ నుంచి పుట్టుకువచ్చినవే ఈ చిత్ర దృశ్యాలు. కథా నేపథ్య నగరంగా కాశీ (వారణాసి- Varanasi)ని ఎంచుకున్నారు. 2898వ సంవత్సరానికి సంబంధించిన విజువల్సే మనకు ఇప్పటిదాకా చూపించారు. నిజానికి ఈ కథ కురుక్షేత్ర(Kurukshetra War) యుద్ధ సమయంలో  మొదలై, 2898 దాకా నడుస్తుంది. మహాభారత(Maha Bharata) కాలానికి సంబంధించిన దృశ్యాలు ఇంకా మన కంటపడలేదు. అయితే, మహాభారత కాలానికి చెందిన పురాణ పాత్రలేవి ఉండవని దర్శకుడు నాగ్​ అశ్విన్​ ఈ మధ్యే స్పష్టం కూడా చేసాడు. అప్పటినుండీ ఇప్పటి(2898)దాకా ఉండే ఒకేఒక పాత్ర, అశ్వత్థామ(Ashwatthama). దాన్ని అమితాబ్​ బచ్చన్(Amitabh Bachchan)​ పోషిస్తున్నారు. ప్రభాస్​కు దీపికాపడుకునే(Deepika Padukone) నాయిక కాదని తేలిపోయింది. అసలు కల్కి(Kalki) పాత్ర ఎవరనేది ఇంకా తెలియదు. అంటే ఈ మొదటి భాగంలో కల్కి ఉండడు.

 

సరే.. కథ ఏమైనా, సినిమాకు సంబంధించిన దృశ్యాలు చూస్తుంటే, మన సినిమా చూస్తున్నట్లుగా లేదు. ఇంతకుముందే అనుకున్నట్లు ఏదో అవెంజర్స్​ సినిమాలా ఉంది. కథాగమనంలో భారతీయత(Indianness) ఉంది కానీ, చిత్రీకరణలో భారతీయత కనబట్టంలేదు. మహాభారత కాలం, అశ్వత్థామ..లాంటి పదాలు విని, ఏలియన్స్​, వేరే గ్రహాలు, వింత వింత వాహనాలు, ఆయుధాలు లాంటివి చూస్తుంటే, ఈ రెండిటికీ మధ్య సమన్వయం కుదరడం లేదు. చిత్ర కథ ఇప్పటికి దాదాపు 850 ఏళ్ల తర్వాత జరిగేదే అయినా, అప్పటి సాంకేతికత అలాగే ఉంటుందని ఊహించినా, ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో ఉన్న మనం, ఆ స్థాయిలో ఊహించుకోవడం చాలా కష్టం.  సినిమా చాలావరకు ఇంగ్లీషు సినిమాల పోకడలో ఉందనేనది కాదనలేని సత్యం. సాంకేతికత(Technology), నటీనటుల ఆహార్యం(Costumes), వాతావరణం(Environment), కాశీ నగరం… అన్నీ భారతీయతను ప్రదర్శించలేకపోయినట్లున్నాయి. సాంకేతికంగా సినిమా చాలా గొప్పగా ఉండే అవకాశమున్నా, భారతీయ కుటుంబ ప్రేక్షకుల(Family Viewers)ను ఆకర్షించగలిగే సన్నివేశాలు, నాటకీయత కూడా ఉంటేనే ఈ సినిమా విజయం సాధిస్తుంది. ప్రభాస్​ అభిమానులను, అవెంజర్స్ లాంటి సినిమాలను ఇష్టపడే యువతను ఈ చిత్రం మెప్పించవచ్చు. కానీ, నిజమైన విజయమంటే, కుటుంబ ప్రేక్షకులను కూడా అలరించే విధంగా ఉండాలి. అందునా, భారతీయ, తెలుగు చిత్రం. టీజర్లు, ట్రైలర్​ విడుదల కాకముందు, దర్శకుడు చెప్పిందాని ప్రకారం, ప్రేక్షకులు ఏవేవో ఊహించుకున్నారు.

అమితాబ్​ వయసులో ఉన్నప్పటి అశ్వత్థామగా కనిపించడం చూసాక, శ్రీకృష్ణుడిని, ఆర్జునుడినీ కూడా చూస్తామనుకున్నారు. కానీ, వాటిని దర్శకుడు కొట్టిపడేసాడు. ఇటువంటి కథే కలిగిన ఇంగ్లీష్​ చిత్రమొకటి(DUNE.?) ఉందని సోషల్​ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నా, అంతిమంగా సినిమా ఎలా ఉన్నదనేదే ముఖ్యం. మహానటి(Mahanati) లాంటి బయోపిక్​ను కూడా హృద్యంగా మలిచిన నాగ్​, మరీ మనసు పెట్టి తీసిన సినిమా కావడంతో, అంత జాగ్రత్త వహించకుండా ఉంటాడా అనేదే ఊరటనిచ్చే మాట. కానీ, సాంకేతికతకు పెద్దపీట వేసి, దాని చుట్టూనే కథ అల్లుకుంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది. చూద్దాం… కల్కి ఏ విధంగా వస్తాడో? మనకి నచ్చేవిధంగానే వస్తాడని ఆశించడంలో తప్పులేదుగా.

 

 

Exit mobile version