Maa Jathara Review | మాస్ జాతర మూవీ రివ్యూ: జాతరలో మాస్ మిస్సయిందా?

మాస్ మహారాజా రవితేజ 75వ సినిమా మాస్ జాతర భారీ అంచనాలతో విడుదలైంది. యాక్షన్‌, కామెడీ, ఎమోషన్‌ల మేళవింపుగా వచ్చిన ఈ సినిమా ఫైట్లు ఆకట్టుకున్నా, కథలో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులను పూర్తిగా రంజింపజేయలేకపోయింది. రవితేజ ఎనర్జీ హైలైట్‌ అయినప్పటికీ, స్క్రీన్‌ప్లే బలహీనతలు స్పష్టంగా కనిపిస్తాయి.

Mass Jathara Review: Ravi Teja’s Energy Roars, But the Story Falls Flat

Mass Jathara Review: Ravi Teja’s Energy Roars, But the Story Falls Flat

నటీనటులు: రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్రప్రసాద్
దర్శకుడు: భాను భోగవరపు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నిర్మాత: నాగవంశీ

కథరైల్వే పోలీస్‌ ల‌క్ష్మ‌ణ్‌ భేరి యుద్ధం

రైల్వే పోలీస్‌ అధికారి భేరి లక్ష్మణ్‌ (రవితేజ) న్యాయం కోసం నిలబడే వ్యక్తి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడే ఎదురు తిరుగుతాడు. వరంగల్‌లో మంత్రి కొడుకును కొట్టడంతో అల్లూరి జిల్లాలోని అడవివరం అనే గ్రామానికి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. ఆ గ్రామం మొత్తం గంజాయి వ్యాపారంలో మునిగిపోయి ఉంటుంది. రైతులతో గంజాయి పండించి, కలకత్తాకు ట్రాన్స్‌పోర్ట్ చేసే శివుడు (నవీన్ చంద్ర) అక్క‌డ రాజ్యమేలుతున్నాడు.
లక్ష్మణ్ భేరి తన చిన్న పరిధిలోనే అతన్ని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం ఎంతవరకు సఫలం అయిందో, తులసి (శ్రీలీల)తో ప్రేమకథలో ఉన్న ట్విస్టులు, తాతయ్య (రాజేంద్రప్రసాద్)తో ఉన్న బంధం – ఇవన్నీ కథలోని ప్రధానాంశాలు.

విశ్లేషణరొటీన్ కథలో రవితేజ జోష్‌

భాను భోగవరపు రచయితగా ఎన్నో కామెడీ సినిమాలు రాసినప్పటికీ, దర్శకుడిగా మొదటిసారి తీసిన ఈ సినిమా మాత్రం పూర్తి మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌. కథ కొత్తేమీ కాదు – అన్యాయానికి ఎదురు నిలిచే పోలీస్‌ అధికారిని చూపించే ఫార్ములా లైన్‌. కానీ, దానిలో కొత్తదనం లేకపోవడం, భావోద్వేగాలు కొరవడటం వల్ల సినిమా కొంచెం పాత వాసన కొడుతుంది.

మాస్ కమర్షియల్‌ సినిమాల లెక్కలన్నీ ఇందులో కనిపిస్తాయి – హీరో ఇంట్రో ఫైట్‌, హీరోయిన్‌తో పాటలు, విలన్‌ను చివర్లో చంపే సీన్‌, యాక్షన్‌ సన్నివేశాలు – అన్నీ మామూలుగానే ఉన్నాయి. రవితేజ స్టైలింగ్‌, డ్యాన్స్‌, కామెడీ టైమింగ్‌ అన్నీసరిపోయే స్థాయిలోనే ఉన్నా కథలో పటుత్వం లేకపోవడంతో అంత ఎగ్జైట్‌మెంట్‌ లేకపోయింది. మధ్యలో కామెడీ సన్నివేశాలు హైపర్ ఆది, అజయ్ ఘోష్‌ వంటి వారితో కొంత నవ్వించాయి గానీ తర్వాత ఎబ్బెట్టుగా మారాయి.

నటీనటుల ప్రదర్శన

రవితేజ ఎనర్జీ మాత్రం అద్భుతంగా ఉంది. యాక్షన్‌, ఫైట్స్‌, డ్యాన్స్‌ – అన్నింటినీ తనదైన మాస్‌ స్టైల్లో క్యారీ చేశాడు. కానీ స్క్రిప్ట్‌ బలంగా లేకపోవడంతో ఆ జోష్​ ఫలితం చూపించలేదు. శ్రీలీల పాత్ర పరిమితంగానే ఉన్నా, స్క్రీన్‌పై అందం, గ్లామర్‌ మాత్రమే ఫోకస్ అయింది. శ్రీకాకుళం యాసలో ఆమె మాట్లాడడం మాత్రం కొత్తగా అనిపిస్తుంది.
నవీన్ చంద్ర విలన్‌గా మళ్ళీ తన సత్తా చూపించాడు. రాజేంద్రప్రసాద్ పాత్రలోని ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది కానీ, డ్రామా బలహీనంగా ఉంది.

టెక్నికల్ అంశాలు

భీమ్స్‌ సిసిరోలియో సంగీతం హిట్‌ సాంగ్స్‌ ఇచ్చినా, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ లౌడ్‌గా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్స్‌ రిచ్‌గా ఉన్నాయి. ప్రొడక్షన్‌ విలువలు ఉన్నతంగా కనిపిస్తాయి. ఎక్కడా రాజీ పడలేదు. కానీ స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌ సరిగ్గా లేకపోవడంతో కథ మధ్యలో నిలిచిపోయినట్టే అనిపిస్తుంది.

ప్రేక్షకుల స్పందనషాకింగ్‌ ఓపెనింగ్స్‌

సినిమా విడుదలైన తొలి రోజే షాకింగ్‌ రెస్పాన్స్‌. హైదరాబాద్‌ ప్రసాద్స్​ మల్టీప్లెక్స్‌ సహా అనేక థియేటర్లలో షోలు హౌస్‌ఫుల్‌ కాలేదు. కొన్ని చోట్ల షోలు రద్దు అయ్యే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. యూఎస్‌ సహా ఓవర్సీస్‌లో కూడా కలెక్షన్లు నిరాశపరిచాయి. ట్రైలర్‌లో ఉన్న పాతదనమూ, “బాహుబలి: ది ఎపిక్” వంటి పెద్ద చిత్రాల ప్రభావమూ ఈ నిరాశాజనకమైన ఓపెనింగ్స్‌కు కారణమని థియేటర్‌ యజమానులు అంటున్నారు.

సోషల్ మీడియా రివ్యూలు

కొంతమంది అభిమానులు మాత్రం ట్విట్టర్‌లో #MassJathara హ్యాష్‌ట్యాగ్‌తో రవితేజ ఎనర్జీని ప్రశంసించారు. “ఫస్ట్ హాఫ్‌ ఎనర్జీ ప్యాక్‌, సెకండ్ హాఫ్‌ యాక్షన్‌ బ్లాక్స్‌, ఇంటర్వల్ ఫైట్‌ హైలైట్‌” అని కొందరు రాశారు. మరికొందరు “వింటేజ్‌ రవితేజ షో” అని పిలిచారు. అయితే, సినిమా మాస్‌ కలర్‌లో ఉన్నా, కంటెంట్‌ మాత్రం బ్లాక్​ అండ్​ వైట్​లో ఉందని ఎక్కువ మంది ప్రేక్షకుల అభిప్రాయం

తుది తీర్పు

భీమ్స్‌ మ్యూజిక్‌, యాక్షన్‌ కొరియోగ్రఫీ, రవితేజ ఎనర్జీ – ఇవే సినిమా బలాలు. కథ, ఎమోషన్‌, స్క్రీన్‌ప్లే మాత్రం బలహీనతలు. మాస్‌ అభిమానులకు కొంత ఫైట్‌ మజా లభిస్తుంది కానీ, కొత్తదనం కోరుకునే వారికి నిరాశే. ముఖ్యంగా రవితేజను ఇష్టపడేవారికి ప్లేట్​ మీల్సే దక్కింది.

తీర్పు:
మాస్ జాతర — రవితేజ ఫ్యాన్స్‌ కోసం మాత్రమే. కథ పాతదే, కానీ ఎనర్జీ మాత్రం మామూలు కంటే ఎక్కువ!

విధాత రేటింగ్‌: 2½ / 5

Mass Jathara Review:
Ravi Teja’s 75th film Mass Jathara offers solid action and energy but fails to impress with its outdated storyline. While the cinematography, music, and performances keep it alive, weak writing and predictable screenplay drag it down. Perfect for Ravi Teja fans, but not for those expecting freshness.
Rating: ⭐⭐½ / 5