విధాత : మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘తుడరుమ్’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు అధికారికంగా ఎంపికైంది. ఈ విషయంపై మోహన్ లాల్ ఎక్స్ లో స్పందించారు. 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్‌కు (IFFI 2025) ఇండియన్ పనోరమా విభాగంలో తుడరుమ్ ఎంపికైందని, ఇది ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం గౌరవంగా, సంతోషంగా ఉంది. మీ అందరి ఆదరణ వల్లే ఇది సాధ్యమైంది. ఇంత గొప్ప గుర్తింపు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అని తన పోస్ట్‌లో మోహన్‌లాల్ రాసుకొచ్చారు. 56వ అంతర్జాతీయ చలనచిత్ర వేడుక గోవా వేదికగా నవంబర్ 20 నుంచి 28 వరకూ జరగనుంది. ఈ వేడుకలో ‘తుడరుమ్’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
మోహన్‌లాల్ కథానాయకుడిగా, శోభన కధనాయికగా తరుణ్‌మూర్తి రూపొందించిన ‘తుడరుమ్’ కేరళలో రూ.100 కోట్లు (గ్రాస్) వసూలు చేసిన తొలి మలయాళ సినిమాగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.210+ కోట్లు రాబట్టి అత్యధిక వసూలు చేసిన మలయాళ చిత్రాల జాబితాలో చోటు సొంతం చేసుకుంది. సాఫీగా జీవితాన్ని సాగిస్తున్న ఓ ట్యాక్సీ డ్రైవర్ ఊహించని విధంగా హత్య కేసులో ఇరుక్కోవడం, దానినుంచి బయటపడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడనే అంశాలతో దర్శకుడు తరుణ్‌మూర్తి తెరకెక్కించారు. ఓటీటీలోనూ ఈ మూవీ సత్తా చాటింది.
