Kalki 2898 AD| తెలుగు సినిమా స్థాయి పెరిగింది. దేశం గర్వించే సినిమాలు ఇప్పుడు టాలీవుడ్ నుండి రూపొందుతున్నాయి. మన సినిమాలకి విదేశీయలు కూడా పట్టం కడుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా టాలీవుడ్ సినిమా ఆస్కార్ కోసం ఎదురు చూస్తుండగా, ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ కల నెరవేరింది. ఇక ఇటీవల కాలంలో మంచి సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో కల్కి 2898 ఏడీ చిత్రం ఒకటి కాగా, ఈ మూవీ 2024 లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా నిలవడం విశేషం. ఇక డిసెంబర్ 6న విడుదల కానున్న పుష్ప: ది రూల్-పార్ట్ 2 అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రంగా అని ఐఎండీబీ యూజర్స్ పేజ్ ద్వారా షేర్ చేసింది.
ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాలు, మోస్ట్ అవైటెడ్ భారతీయ చిత్రాల జాబితాల విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఐఎండీబీకి ఉన్న మిలియన్లకు పైగా నెలవారీ విజిటర్స్ రియల్ పేజ్ వ్యూస్ ఆధారంగా జాబితాని రూపొందించారు. పాపులర్ మూవీస్ జాబితాలో కల్కి 2898 ఏడీ మూవీ తొలి స్థానం దక్కించుకోగా, రెండో స్థానంలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమా మంజుమ్మెల్ బాయ్స్ ఉంది. ఆ తర్వాతి స్థానాలలో ఫైటర్, హనుమాన్, సైతాన్, లాపతా లేడీస్, ఆర్టికల్ 370, ప్రేమలు, ఆవేశం, ముంజ్యా చిత్రాలు ఉన్నాయి.
ఇక అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల విషయానికి వస్తే.. ‘పుష్ప-2’ సినిమా అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘దేవర 1’ చిత్రం రెండో స్థానం దక్కించుకుంది. అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘వెల్ కమ్ టూ ది జంగిల్’.. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాలు వరుసగా 3, 4 స్థానాలలో నిలిచాయి.ఇక తమిళ హీరో సూర్య నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కంగువ’ ఐదో స్థానంలో ఉండగా, అజయ్ దేవగణ్, రణవీర్ సింగ్, దీపికా పదుకునే, కరీనా కపూర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘సింగం అగైన్ తర్వాతి స్థానం దక్కించుకుంది. ఇక కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ‘భూల్ భూలయ్యా 3’.. చియాన్ విక్రమ్, డైరెక్టర్ పా. రంజిత్ కాంబోలో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘తంగలాన్’.. అజయ్ దేవగన్, టబు కలిసి నటించిన ‘ఔరోన్ మే కహన్ దమ్ థా’.. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ నటించిన ‘స్త్రీ 2’ చిత్రాలు తర్వాతి స్థానాలలో నిలిచాయి.