- నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో సరికొత్త ప్రయోగం
- తక్కువ బడ్జెట్‌తో అద్భుత VFX
- జనరేటివ్ ఏఐతో భవనం కూల్చిన సన్నివేశం
- హాలీవుడ్‌లో ఉద్యోగ భయం
నెట్‌ఫ్లిక్స్(Netflix) తన ఒరిజినల్ సిరీస్‌లలో తొలిసారిగా జనరేటివ్ కృత్రిమ మేధస్సును (Generative AI) వినియోగించింది. ఈ సాంకేతికతతో చిత్రాలు, ప్రోగ్రామ్‌లు తక్కువ ఖర్చుతో మెరుగైన నాణ్యతతో రూపొందించవచ్చని సంస్థ సహ-సీఈఓ టెడ్ సారాండోస్ తెలిపారు. అర్జెంటీనా సైన్స్ ఫిక్షన్ సిరీస్ ఎల్ ఎటెర్నౌటా (The Eternaut) లోని ఒక భవనం కూలిపోవడం వంటి సన్నివేశాన్ని రూపొందించడానికి జనరేటివ్ ఏఐ ఆధారిత టూల్స్ ఉపయోగించారని ఆయన వెల్లడించారు. సంప్రదాయ గ్రాఫిక్స్ పద్ధతుల(traditional VFX)తో పోలిస్తే ఇది పదింతల వేగంగా పూర్తయిందని, ఖర్చు కూడా నమ్మశక్యం కానంత తక్కువ అయిందని అన్నారు.
సారాండోస్ ప్రకారం, కృత్రిమమేధ వినియోగం వలన ప్రీ-విజువలైజేషన్, షాట్ ప్లానింగ్ వంటి పనుల్లో క్రియేటర్లు వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తున్నారు. తక్కువ బడ్జెట్‌తో ఉన్న ప్రాజెక్టులకు కూడా అధునాతన విజువల్ ఎఫెక్ట్స్ అందించడానికి ఈ సాంకేతికత తోడ్పడుతోంది. ఎల్ ఎటెర్నౌటాలో ఉపయోగించిన ఏఐ ఫుటేజ్ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ లేదా సినిమాలో తెరపై ప్రదర్శించిన మొదటి ఉదాహరణగా నిలిచింది. ఈ ప్రయోగం వలన ఉత్పత్తి వ్యయం కూడా గణనీయంగా తగ్గిందని తెలిపారు.
అయితే వినోద పరిశ్రమలో ఏఐ వినియోగం పట్ల కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతరుల కృషిని అనుమతి లేకుండా ఉపయోగించడం, ఉద్యోగ నష్టం కలిగించే అవకాశం వంటి విమర్శలు వస్తున్నాయి. 2023లో హాలీవుడ్ నటులు, రచయితల సమ్మెలో కూడా ఏఐ వినియోగం ప్రధాన సమస్యగా మారింది. అలాగే 2024లో చిత్ర నిర్మాత టైలర్ పెర్రీ, కృత్రిమమేధ అభివృద్ధి కారణంగా 800 మిలియన్ డాలర్ల స్టూడియో విస్తరణ ప్రణాళికను వాయిదా వేశారు. అయినప్పటికీ అనేక స్టూడియోలు ఈ సాంకేతికతను స్వీకరించేందుకు ముందుకు వస్తున్నాయి. సింగపూర్‌కి చెందిన అనిమేషన్ స్టూడియో క్రేవ్‌ఎఫ్‌ఎక్స్ సహ వ్యవస్థాపకుడు డేవియర్ యూన్ ప్రకారం కృత్రమమేధ, చిన్న స్టూడియోలు కూడా పెద్ద బడ్జెట్ విజువల్స్‌ను తయారుచేయడానికి సహాయం చేస్తోంది. అయితే క్లైమాక్స్‌లో ఏం చూపించాలో కళాకారుడే కానీ ఏఐ కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే, జూన్ చివరి త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్ ఆదాయం 16% పెరిగి 11 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ వృద్ధికి కొరియన్ థ్రిల్లర్ స్క్విడ్ గేమ్ మూడవ మరియు చివరి సీజన్ విజయవంతమైన ప్రదర్శన ప్రధాన కారణమని సంస్థ వెల్లడించింది.