Rakul Preet Singh | ప్రభాస్ (Prabhas) కెరియర్‌లో ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ (Mr Perfect) మూవీ ప్రత్యేకం. దిల్ రాజు (Dil Raju) నిర్మించిన ఈ మూవీకి దశరథ్ (Dasaradh) దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను హీరోయిన్లుగా నటించారు. 2011లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే, ఈ మూవీ గురించి దర్శకుడు దశరథ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజు తాను నిర్మించే సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండేలా చూసుకుంటారని.. అందుకే ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ మూవీని నిర్మించేందుకు అంగీకరించరాన్నారు. ప్రభాస్ కథను రెండోసారి విని ఒకే చెప్పాడన్నారు. ప్రభాస్ పెద్దగా ఏమీ పట్టించుకోడని.. చెప్పింది చేస్తూ వెళ్తాడని అనుకుంటారని.. కానీ, ఎంత హోం వర్క్ చేస్తాడో నాకు మాత్రమే తెలుసునన్నారు.
మూవీలో మొదట రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)ని హీరోయిన్‌గా అనుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఆమె తండ్రితో మాట్లాడామని.. అనివార్య కారణాలతో కాజల్‌ని తీసుకున్నట్లు తెలిపారు. రకుల్ విషయంలో ఎవరికీ ఎలాంటి అసంతృప్తి లేదన్న ఆయన.. ఆమెకు అంకితభావం ఎక్కువ అంటూ ప్రశంసించారు. సినిమాలో ఆమెను తీసుకోకపోవడానికి కారణం మార్కెట్ పరమైన డిమాండ్ కావచ్చని చెప్పారు. ఆ తర్వాత రకుల్ తండ్రి వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పామన్నారు. ఆ తర్వాత రకుల్ మొదటి సినిమా ఆడియో ఫంక్షన్‌కి ప్రభాన్, తాను వెళ్లామంటూ గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ సైతం ఇటీవల ప్రభాస్ సినిమా నుంచి తనను అకారణంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
కెరీర్ ప్రారంభంలోనే ప్రభాస్‌తో నటించే ఛాన్స్ వచ్చిందని.. బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ప్రభాస్‌తో నటించే అవకాశం రావడంతో సంతోషించినట్లు చెప్పింది. నాలుగు రోజులు షూటింగ్ తర్వాత ఢిల్లీకి వెళ్లగా తనను మూవీ నుంచి తొలగించినట్లు తెలిసిందని వాపోయింది. కనీసం, సమాచారం కూడా ఇవ్వలేదని.. ఆ తర్వాత మరో సినిమా కూడాలోనూ ఇదే పరిస్థితి ఎదురైందని చెప్పింది. షూటింగ్ ప్రారంభం కాక ముందే తొలగించడంతో.. ఆ తర్వాత అవగాహన వచ్చిందని.. వాటిని పెద్దగా పట్టించుకోవద్దని అనుకున్నానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్నది. చివరిసారిగా ఇండియన్ – 2 మూవీలో నటించింది. ప్రస్తుతం ఇండియన్ – 3తో పాటు దే దే ప్యార్ దే 2 చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నది. చివరిసారిగా తెలుగులో కొండపొలం చిత్రంలో నటించింది.